ఏపీకి మళ్లీ భారీ వర్షాలు

ఏపీకి మళ్లీ భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్  మరో మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం నవంబర్ 29న ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ బలపడి మరో 24 రోజుల్లో వాయుగుండంగా మారనుందని తెలిపారు. వరుస వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

ఇటీవల వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.  దక్షిణ కోస్తాంద్ర, యానాంతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతం తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేగంగా గాలులు వీస్తాయి. మత్స్యకారులను అధికారులు అలర్ట్ చేశారు. డిసెంబర్ 1 వరకు వేటకు వెళ్లకూడదని మత్స్యాకారులకు సూచించారు

మరోవైపు ఏపీలో రెండవ రోజు కేంద్ర బృందాలు పర్యటించాయి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం, మామడుగు గ్రామంలో సెంట్రల్ టీమ్ సభ్యులు పర్యటించారు.  కోత దశలో ఉండగా భారీ వర్షాలతో వరిపంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులు అధికారులకు చెప్పారు.  ఉద్యాన పంటలైన టమాటా, బీన్స్, క్యాబేజీ, ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్ పంటలు దెబ్బ తిన్నాయని తెలిపారు. అటు తిరుపతిలోని పలు కాలనీల్లోనూ కేంద్ర అధికారులు పర్యటించారు. నష్టాన్ని అంచనా వేశారు.