
- జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వడ్లు
- కూలిన దుద్దెడ టోల్ గేట్ పైకప్పు
- పిడుగుపాటుకు రెండు గేదెల మృతి
సిద్దిపేట, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈదరుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. తొగుట మండలం తుక్కాపూర్ లో విద్యుత్ స్తంభం విరిగి పడగా పలుచోట్ల చెట్లు నెలకొరిగాయి. సిద్దిపేట, దుబ్బాక మార్కెట్ యార్డుల్లో ఆరుబయట అమ్మకానికి పెట్టిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.
సిద్దిపేట మార్కెట్ యార్డులోని ధాన్యం వరద నీటి ధాటికి శ్రీరాం కుంట్ల చెరువులోకి చేరింది. జిల్లాలోని తొగుట, దౌల్తాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి, చిన్నకోడూరు, బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్, కొండపాక, అక్కన్నపేట మండలాల్లో భారీ వర్షం కురియగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చిన్నకోడూరు, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. తొగుట మండల కేంద్రంలో ఆటోపై చెట్టు కూలింది.
కొండపాక మండలం దుద్దెడ టోల్ గేట్ పైకప్పు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండపాక మండలం దర్గా నుంచి అంకిరెడ్డిపల్లి మార్గ మధ్యలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ లో పిడుగు పడి చక్రాల బాలరాజ్ కు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి, డైరెక్టర్లు సిద్దిపేట మార్కెట్యార్డ్కు చేరుకొని రైతులకు ధైర్యం చెప్పారు. చేర్యాల మండలం కమలాయపల్లిలో ఈదురుగాలులకు ఓ ఇంటిమీది రేకులు ఎగిరిపోయాయి.