దంచికొట్టిన వాన..మెదక్, సిద్దిపేట జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు

దంచికొట్టిన వాన..మెదక్, సిద్దిపేట జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు
  • తూప్రాన్ మండలం ఇస్లాంపూర్​లో అత్యధికంగా 17.8 సెంటిమీటర్ల వర్షం
  • ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,  నీట మునిగిన పంట పొలాలు
  • పలు రూట్లలో రాకపోకలు బంద్ 

మెదక్​, సిద్దిపేట, వెలుగు: మెదక్​, సిద్దిపేట జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి  సోమవారం తెల్లవారు జాము వరకు వర్షం దంచి కొట్టింది. గంటల తరబడి కుండపోత వాన పడడంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

మెదక్​ జిల్లాలో.. 

జిల్లాలో తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో అత్యధికంగా 17.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లిలో 17.2, పెద్దశంకరంపేటలో 16.4, వెల్దుర్తిలో 15.8, మాసాయిపేటలో 14.8, శివ్వంపేటలో 14.7, కొల్చారంలో  13.7, మనోహరాబాద్ లో13.0, టేక్మాల్ లో 12.6, నర్సాపూర్ లో 12.6 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం మండలంలోని హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చెక్ డ్యామ్ లు పొంగి పొర్లుతున్నాయి. ఇస్లాంపూర్ లో పంట కాల్వలు తెగి పొలాలు జలమయం అయ్యాయి.

టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద పెద్ద వాగు ఉప్పొంగడం వల్ల బొడ్మట్ పల్లి, -మెదక్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. టేక్మాల్  మండలం  దన్నుర చెరువు ప్రవాహం వల్ల టేక్మాల్, -దన్నుర మధ్య  రాకపోకలకు బంద్​అయ్యాయి. గుండు వాగు వరదతో టేక్మాల్, -సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట పట్టణాలకు  రాకపోకలు నిలిచిపోయాయి.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. గజ్వేల్ డివిజన్ పరిధిలోని 5 మండలాలాల్లో భారీ వర్షం కురిసింది. వర్గల్ మండలం గౌరారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 236 మిల్లీ మీటర్ల వర్షం పడింది. వర్గల్​లో 232.2, ములుగులో 160.3, మర్కుక్ లో 141.2, కొమురవెల్లిలో 120,  గజ్వేల్​లో 104.5,  రాయపోల్ మండలంలో  98.9, మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అక్కన్న పేట మండలంలో 0.8 మిల్లీ మీటర్ల అత్యల్ప వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిరుదొడ్డి, గజ్వేల్, రాయపోల్ మండలాలు మినహా మిగిలిన 23 మండలాల్లో  సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.

జిల్లాలోని కూడవెల్లి, హల్దీ, మోయ తుమ్మెద వాగుల్లో భారీగా వరద నీరు చేరడంతో చెక్ డ్యామ్ ల మీదుగా నీరు పారుతోంది. ధూల్మిట్ట,  బైరాన్ పల్లి గ్రామాల మధ్య రాకపొకలు నిలిపివేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, అక్భర్​పేట, భూంపల్లి, దుబ్బాక మండలాల్లో కూడవెళ్లి వాగు ఉగ్రరూపం దాల్చింది. సీపీ అనురాధ వాగును పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలకు పలు సూచనలు చేశారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ వద్ద గల రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి అధికారులు నీటి పంపింగ్ ను  ప్రారంభించారు. 

మహోధృతంగా మంజీర

పాపన్నపేట: మెదక్ జిల్లాలో మంజీరా నది మహోధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో జిల్లాలోని చిలప్​చెడ్, కొల్చారం, పాపన్నపేట, టేక్మాల్, హవేలీ ఘనపూర్ మండలాల పరిధిలో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ నిజాంసాగర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కొల్చారం మండల పరిధిలో ఉన్న  వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి మత్తడి పోస్తుంది. ఆనకట్ట దిగువన ఉన్న మంజీరా నది ఏడుపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

నదీ పాయల మధ్యన గుట్టపై వెలసిన వన దుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయ మండపం మొత్తం నీట మునిగింది. ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న రెండు బ్రిడ్జిలు, గుడిలోనికి వెళ్లేందుకు నిర్మించిన మెట్లు, క్యూలైన్ లు మొత్తం నీటిలో మునిగిపోయాయి. ఏరియల్ వ్యూలో విశాలమైన ఏడుపాయల ప్రాంగణం మంజీరా నది పరవళ్లు తొక్కుతూ  కనువిందు చేస్తోంది.

వర్షాలపై అలర్ట్ గా ఉండాలి:  మంత్రి దామోదర 

శివ్వంపేట: వర్షాలు, వరదలపై అలర్ట్​గా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం మండలంలోని పిల్లుట్లలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కాంగ్రెస్​నాయకులు, ఆర్డీవో మహిపాల్ రెడ్డితో మాట్లాడారు.  వర్షాలు, వరదల వల్ల ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలుగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలగకుండా ముందు  జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు: కలెక్టర్ రాహుల్ రాజ్

తూప్రాన్ : రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీచేయడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం తూప్రాన్ మండలంలో పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు దూర ప్రాంత పర్యటనలు వాయిదా వేసుకోవాలన్నారు. ఎక్కడైనా రోడ్లు తెగిపోవడం జరిగితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

పొంగి పొర్లుతున్న వాగులు దాటకుండా బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సాయం కోసం కలెక్టర్, పోలీస్​కార్యాలయాల్లోని కంట్రోల్ రూం నంబర్లకు ఫోన్​చేయాలని సూచించారు. ఆయన వెంట జడ్పీ సీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్​చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శివానందం, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.