హైదరాబాద్ సిటీ, వెలుగు: అనుకోకుండా కురిసిన వానకు సిటీ ఆగమైంది. సోమవారం మధ్యాహ్నం 3:30 నుంచి 6:30 గంటల వరకు కుండపోత వాన కురవడంతో అతలాకుతలమైంది. ఈ దెబ్బకు మెయిన్ రోడ్లు నదుల్లా మారాయి. నడుంలోతు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. ఉరుములు, మెరుపులతో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. ఎల్లారెడ్డిగూడలోని ఇండ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. అమీర్ పేట ఏరియా ముంపునకు గురైంది. బోరబండలో బంజారా హిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కాలుజారి కింద పడి చనిపోయాడు.
శ్రీనగర్‌కాలనీలోని పెట్రోల్‌బంక్ దగ్గర రోడ్డుపై నడుం లోతు వరకు నీళ్లు రావడంతో బారికేడ్లు పెట్టి మెయిన్‌రోడ్డు మూసేశారు. దీంతో కార్లు, టూవీలర్లు, ఆటోలతో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఓ ప్రముఖ స్కూల్ బస్సు ఇరుక్కుపోయింది. అందులో సుమారు 20 మంది పిల్లలు ఉండగా, బిక్కుబిక్కుమంటూ గడిపారు. ముందుకు, వెనక్కి వెళ్లే దారిలేక వారి తల్లిదండ్రులకు కబురు పంపడంతో ఆటోలు, టూ వీలర్లపై వచ్చి తీసుకువెళ్లారు.
చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే కనిపించింది. భారీ వర్షంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ లక్డీకాపూల్ , ఖైరతాబాద్ ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని చోట్ల చెట్లు విరిగి పడగా సిబ్బంది తొలగించారు. పోలీసులు కూడా వాన పడుతున్నప్పుడు ఇండ్లల్లో ఉన్నవారు, ఆఫీసుల్లో ఉన్నవారు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
