తెగిన రోడ్లు.. కల్వర్టులు దెబ్బతిన్న పంటలు..అత్యధికంగా 8 వేల ఎకరాల్లో పత్తి నీటి పాలు

తెగిన రోడ్లు.. కల్వర్టులు దెబ్బతిన్న పంటలు..అత్యధికంగా 8 వేల ఎకరాల్లో పత్తి నీటి పాలు
  • 11 వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం 
  • వర్షం మిగిల్చిన నష్టాన్ని ప్రాథమిక అంచనా వేసిన అధికారులు
  • వరదలపై ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా  
  • ఎగువన  కురుస్తున్న వర్షాలకు పెన్ గంగా ఉగ్రరూపం

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం కురిసిన భారీ వర్షం జిల్లాలో తీవ్ర నష్టం కలిగించింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, పంట పొలాలు, చెరువులు, ఇండ్లు దెబ్బతిన్నాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో చెరువులకు గండిపడి వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. రైతులకు ఈ వర్షం తీరని శోకాన్ని మిగిల్చింది. జిల్లాలో 266 గ్రామాల పరిధిలో 4,118 మంది రైతులకు సంబంధించిన 11,156 ఎకరాలు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి.

ఇందులో అత్యధికంగా పత్తి 8,896 వేల ఎకరాలు పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.  పంచాయతీ రాజ్ పరిధిలోని 55 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి మరమ్మతులు చేయాలంటే రూ. 3.78 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. అటు కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రంతో పాటు పాటు పలు గ్రామాల్లో పర్యటిస్తూ వరద నష్టాన్ని తెలుసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భూర్నూర్ చెరువు కట్ట తెగిపోవడంతో ఆదివారం కలెక్టర్ , ఎస్పీ పరిశీలించారు.

పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అంటు రోగాలు రాకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చింది. జైనథ్ మండలంలోని డోల్హార గ్రామం వద్ద బ్రిడ్జిని తాకేలా వరదనీరు పారుతోంది. దీంతో బోరజ్, జైనథ్, బేల మండలాల నది పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 

మంత్రి ఆరా..

వర్షాలు, వరదలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ తో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రత్తంగా ఉండాలని ఆదేశించారు. శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం నివేదిక తయారు చేయాలన్నారు. 

తాడుతో వాగులు దాటి..  వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ రూరల్  మండలంలోని అంకోలి, తంతోలి, చించుగాట్, లోకారి, వన్ వాట్ తదితరుల ముప్పు ప్రాంతాలలో పర్యటించారు. వాగులు వంకలు తాడు సాయంతో దాటుతూ, నడుము లోతు నీటిలో నుంచి వెళ్లి పలు గ్రామాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు భారీ వరదతో  కోతకు గురైన రోడ్డు వద్ద వెళ్లలేని పరిస్థితు ల్లో కర్రలు వైర్ల సాయంతో బ్రిడ్జి ఎక్కి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.