బెంగళూరులో వర్ష బీభత్సం

బెంగళూరులో వర్ష బీభత్సం

కర్ణాటకలోని  బెంగళూరులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సిటీ జలదిగ్బంధమైంది. భారీవర్షాలకు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. సమయానికి ఆఫీస్ చేరకోలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్తున్నారు. ఐటీ కారిడార్ లోని పలు కంపెనీల్లోకి వరద చేరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. 

మారతహళ్లి- సిల్క బోర్డ్ జంక్షన్ రోడ్డు దగ్గర వరదలో  ఓ వ్యక్తి మునిగిపోయాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని కాపాడారు. వరదలో బైక్ పై నుంచి కింద పడిన అఖిల అనే యువతి చనిపోయింది. కరెంటు పోల్ కి దగ్గరగా వరదలో పడటంతో.. కరెంట్ షాక్ తో అఖిల చనిపోయినట్లు తెలిపారు పోలీసులు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు తక్షణ సాయం కింద రూ.300 కోట్లను సీఎం బసవరాజు బొమ్మై విడుదల చేశారు. వరద ప్రభావిత జిల్లాలకు అదనంగా మరో రూ. 300 కోట్లను కేటాయించారు. నగరంలో రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో స్కూళ్లు, కాలేజీలకు సెలువులు ప్రకటించారు. 

ఈదురుగాలులు, కుండపోత వానకు విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండ్యలోని పంపుహౌస్‌లో వరదనీరు చేరడంతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పంపుహౌస్‌ను క్లీన్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8 వేల బోర్‌వెల్‌ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందన్నారు. బోరుబావులు లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. వరదల్లో 430 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2,188 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 225 కిలోమీటర్ల మేర రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని చెప్పారు. 

 సోమవారం కురిసిన భారీ వర్షాలకు సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌‌కు ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లు, బోట్లు, బుల్డోజర్ల సాయంతో జనాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సిటీలోని డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరద చేరింది. సర్జాపూర్‌‌‌‌ రోడ్‌‌లోని రెయిన్‌‌బో డ్రైవ్‌‌ లేఅవుట్‌‌, సన్నీ బ్రూక్స్‌‌ లేఅవుట్‌‌ వంటి ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. ట్రాక్టర్లు, బోట్ల సాయంతో స్టూడెంట్లు స్కూళ్లు..కాలేజీలకు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లారు. ఔటర్‌‌‌‌ ఏరియాల్లో ఉన్న కాలనీలు నీట మునగడంతో పాటు ఐటీ కంపెనీలకు వెళ్లే దారులన్నీ నదులను తలపించాయి. 

ఈనెల 9 వరకు కర్ణాటకలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. శివమొగ్గ, ఉడుపి, కొడగు, చిక్క మంగళూరు, ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. 

అటు కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.