వాన బీభత్సం..సిటీలో ఇండ్లు కూలి 10 మంది మృతి

వాన బీభత్సం..సిటీలో ఇండ్లు కూలి 10 మంది మృతి
  • సిటీలో ఇండ్లు కూలి 10 మంది మృతి
  • నాచారంలో హైటెన్షన్​ వైర్​ తగిలి ఒకరు..
  • 17 జిల్లాల్లో రెడ్‌‌ అలర్ట్‌‌.. నీట మునిగిన పంటలు
  • హైదరాబాద్‌‌లో వాన నీటికి కొట్టుకపోయిన కార్లు, బైక్​లు
  • నీట మునిగిన రోడ్లు, కాలనీలు.. అనేకచోట్ల కరెంట్​ కట్
  • సహాయ చర్యలకు రంగంలోకి ఎన్డీఆర్​ఎఫ్​.. ఆర్మీనీ దించే చాన్స్​!
  • హైదరాబాద్​ రావాల్సిన విమానాలు మళ్లింపు
  • ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదా
  • మరో రెండు రోజులు వానలు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో మంగళవారం కుండపోత వర్షాలు కురిశాయి. ఏకంగా 17 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగింది. గ్రేటర్​ హైదరాబాద్‌లో పొద్దున్నుంచి అర్ధరాత్రిదాకా వాన పడుతూనే ఉంది. సర్కారు డేటా ప్రకారం.. యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, మేడ్చల్‌ మల్కాజిగిరి, సిద్దిపేట జిల్లాల్లో అత్యంత భారీగా.. మరో 13 జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందిన డేటా ప్రకారం.. 11 చోట్ల అత్యంత ఎక్కువగా, 80 చోట్ల చాలా ఎక్కువగా, 208 చోట్ల భారీగా, 319 చోట్ల ఓ మోస్తరుగా, 263 ప్రాంతాల్లో తేలికపాటిగా వానలు పడ్డాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని సింగపూర్‌ టౌన్‌ షిప్‌లో ఏకంగా 29.1 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా నార్కట్‌పల్లిలో 25 సెంటీమీటర్లు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో 24, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 23, హస్తినాపురంలో 24, దండుమైలారంలో 21.4, సరూర్‌నగర్‌ లో 21, మంగల్‌పల్లిలో 21, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లో 20.7, ఉప్పల్‌లో 20, యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంకిలో 20.5, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 20.4, సిద్దిపేట జిల్లా ములుగులో 20.2 సెంటీమీటర్ల వాన కురిసింది.

48శాతం ఎక్కువగా..

ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే 48 శాతం అదనంగా వర్షాలు కురిశాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 777.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను.. 1,148.2 మిల్లీమీటర్లు రికార్డైంది. 15 జిల్లాల్లో అతి భారీగా, 12 జిల్లాల్లో భారీగా, 6 జిల్లాల్లో నార్మల్‌గా వానలు పడ్డాయి. అత్యధికంగా వనపర్తి జిల్లాలో సాధారణం కంటే 133శాతం ఎక్కువగా వర్షం పడగా.. నిర్మల్‌ జిల్లాలో మైనస్‌ 13 శాతం (లోటు వర్షపాతం)గా ఉంది.

పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని పరీక్షలు వాయిదాపడ్డాయి. బుధ, గురువారాల్లో జరగాల్సిన యూజీ, పీజీ ఎగ్జామ్స్‌ ను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ తేదీలను నిర్ణయించి, త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఎక్కడ చూసినా నీళ్లే..

ఆగకుండా కురుస్తున్న వానతో సిటీలో ఎక్కడ చూసినా నీరే కనిపించింది. చాలా చోట్ల కాలనీలు నీట మునిగి, ఇండ్లలోకి నీళ్లు చేరాయి. టోలిచౌకిలోని నదీం కాలనీ నీట మునగడంతో అక్కడి ప్రజలను డీఆర్ఎఫ్​​ బృందాలు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీసాయి బాలాజీ హోమ్స్​ఫేజ్-2 కాలనీ నీట మునిగినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగల్ హాట్​లోని దిల్వార్​గంజ్ లో ఓ ఇంటిపై పెద్ద బండరాయి జారిపడింది. చైతన్యపురి, చందానగర్, మియాపూర్, ఎల్బీనగర్, హయత్ నగర్, లంగర్​హౌజ్, మౌలాలీ, మల్కాజిగిరి ఈస్ట్, ఆనంద్ బాగ్ లోని షిర్డీ నగర్, ఎన్ఎండీసీ, రాంనగర్, మీర్ పేట, దమ్మయిగూడ, అంజనాద్రి నగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. టోలిచౌకీలోని ఓ హోటల్లోకి మోకాళ్ల లోతు నీరు చేరింది.

చాలా ప్రాంతాలు చీకట్లో..

భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు, చెట్లకొమ్మలు విరిగిపడటంతో హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో గంటల తరబడి కరెంట్ పోయింది. మరో రెండు రోజులు కూడా వానలు పడతాయన్న అంచనాలతో.. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అలర్ట్​ అయ్యారు. 20 డీఆర్ఎఫ్ బృందాలు, సర్కిల్, వార్డుల వారీగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దించారు. 150 వాటర్​ ల్యాగింగ్​ పాయింట్లను గుర్తించి, సహాయక చర్యలు చేపట్టారు.

వాయుగుండం తెలంగాణ మీదుగా వెళ్లడంతోనే..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్​తోనే జోరుగా వానలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ వాయుగుండం ఏపీలో తీరం దాటాక.. మంగళవారం తెలంగాణ మీదుగా ప్రయాణించిందని తెలిపారు. ఇలా తీరం దాటాక ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంటే.. అక్కడ పెద్ద వానలు పడతాయని వివరించారు. బుధవారమూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తర్వాత మరఠ్వాడా ప్రాంతానికి వాయుగుండం వెళ్లిపోతుందని.. దాంతో గురువారం వానలు తగ్గొచ్చని వెల్లడించారు. ఇప్పటికే వాయుగుండం బలహీనమైందని.. బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని తెలిపారు.

హైదరాబాద్​లో 20 ఏండ్ల రికార్డు బ్రేక్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో మంగళవారం వాన దంచికొట్టింది. పొద్దున్నుంచీ ఆగకుండా కురుస్తున్న వాన 20 ఏండ్లనాటి రికార్డును చెరిపేసింది. 2000వ సంవత్సరం ఆగస్టు 24న హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో 24.1 సెంటీమీటర్ల వాన పడగా.. మంగళవారం గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలోని హయత్​నగర్​లో ఏకంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండపోత వాన పడటంతో హైదరాబాద్‌ ఆగమాగమైంది. కాప్రా, ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, అల్వాల్‌, సరూర్‌నగర్‌, మల్కాజిగిరి, బేగంపేట్‌, ఉప్పల్‌, మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మెహిదీపట్నం, లంగర్​హౌజ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. కొన్ని చోట్ల చెరువులను తలపించాయి. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.