మహారాష్ట్రను వణికిస్తున్న వానలు

మహారాష్ట్రను వణికిస్తున్న వానలు

కొల్హాపూర్‌‌‌‌లో భారీ వర్షం

మూతపడ్డ నేషనల్‌‌ హైవే

పుణె, నాసిక్‌‌, థానేల్లో స్కూళ్లు బంద్‌‌

గోవా, కర్నాటకల్లోనూ.. వర్షాలు

మహారాష్ట్రను వానలు ముంచెత్తుతున్నాయి. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. కొల్హాపూర్‌‌, సంగ్లీ‌‌ జిల్లాల్లో దాదాపు యాభైవేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెప్పారు.  85వేల ఇళ్లకు కరెంటు సప్లై ఆపేశారు. భారీగా వరద నీరు చేరటంతో సౌత్‌‌ కొల్హాపూర్‌‌‌‌ – బెల్గాం నేషనల్‌‌ హైవేను బంద్‌‌ చేశారు. “ సోమవారం నేషనల్‌‌ హైవే ఒకవైపు క్లోజ్‌‌ చేశాం. మంగళవారం నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పూర్తిగా క్లోజ్‌‌ చేశాం” అని కొల్హాపూర్‌‌‌‌ ఎస్పీ అభినవ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌ చెప్పారు. కొల్హాపూర్‌‌‌‌ జిల్లాలోని చాలా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటించారు. పుణె, నాసిక్‌‌, థానే జిల్లాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మూలా, ముథా నదుల్లోకి వరద నీరు ఎక్కువగా రావటంతో ఆరు బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ముంబైలో కూడా మంగళవారం ఉదయం వర్షం పడింది. ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌, ఆర్మీ , నేవీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ల సాయంతో బాధితులను తరలిస్తున్నామని, ఇద్దరు ప్రెగ్నెంట్‌‌ లేడీస్‌‌ను కూడా కాపాడామని ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ సిబ్బంది చెప్పింది. వరద పరిస్థితిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌‌ సమీక్షించారు. ఆలమట్టి నుంచి దిగువకు విడుదల చేసే నీటిని పెంచాలని కర్నాటక సీఎం యడియూరప్పకు లేఖ రాసినట్లు ఫడ్నవీస్‌‌ చెప్పారు.

గోవాలోనూ..

ఎప్పుడూ టూరిస్టులతో కిటకిటలాడే గోవానూ వర్షాలు భయపెడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పోర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. ప్యాసింజర్లు, స్టూడెంట్స్‌‌తో కర్నాటక నుంచి వస్తున్న 8 బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి.  చాలా ప్రాంతాల్లో ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్పారు. గోవా సీఎం ప్రమోద్‌‌ సావంత్‌‌ పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రానున్న 24 గంటల్లో గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

కర్నాటకలో రైళ్లు, బస్సు సర్వీసులు రద్దు

కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయని, బెల్గావీ జిల్లాలోని హోస్టక్‌‌లో ఇంటి గోడ కూలి ఒకరు చనిపోయారని అధికారులు చెప్పారు. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున కొన్ని ప్రాంతాల్లో రైలు, బస్సు సర్వీసులను క్యాన్సిల్‌‌ చేసినట్లు అధికారులు చెప్పారు. హుబ్లీ, ధార్వాడ, బెళ్గావీ, విజయపుర, యాదగిరి, రాయచూర్‌‌‌‌, కొడగు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర నుంచి కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆలమట్టి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.