తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు..వెల్లడించిన వాతావరణ శాఖ

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు..వెల్లడించిన వాతావరణ శాఖ

మరో ఐదు రోజులు వానలు పడతాయన్న వాతావరణ శాఖ
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. పలు జిల్లాల్లో 20 డిగ్రీల కంటే తక్కువే
 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పొద్దున్నుంచే మబ్బులు పట్టగా, జల్లులు పడ్డాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, హైదరాబాద్

రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్ జిల్లాల్లో వర్షం పడింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా నాగులవంచలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని నడిగూడెంలో 2.5, గండిపల్లిలో 2.3, రెడ్డిగూడలో 2.2, అర్వపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. మిగతా జిల్లాల్లో ఒక సెంటీమీటర్ కన్నా తక్కువ వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే జల్లులు పడ్డాయి. జూబ్లీహిల్స్​, అమీర్‌‌పేట, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ సహా సిటీ వ్యాప్తంగా వాన కురిసింది. మరో ఐదు రోజులు రాష్ట్రంలో వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పింది.

పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రాత్రి టెంపరేచర్లు మరింత పడిపోతాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో 20 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌‌లో అత్యల్పంగా 15.7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌‌లో 15.9, ఆదిలాబాద్‌లోని భోరజ్‌లో 16.2, వికారాబాద్ జిల్లా మర్పల్లి, నిర్మల్ జిల్లాలోని 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.