పాక్​లో భారీ వర్షాలు.. 37 మంది మృతి

పాక్​లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
  •      తీవ్రంగా ప్రభావితమైన  ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ 

పెషావర్: పాకిస్తాన్ లో గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా 37 మంది మరణించారు. కుండపోత వర్షాలతో ఇండ్లు కుప్పకూలడంతో పాటు  కొండచరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో వాయువ్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలో దాదాపుగా 27 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారు. వర్షాలతో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని లక్కీ మార్వట్, సౌత్ వజీరిస్తాన్, నార్త్ వజీరిస్తాన్, పెషావర్, ఖైబర్, మలకాంద్, లోయర్ దిర్, స్వాత్, బజౌర్ జిల్లాలో దాదాపుగా 37 మంది గాయపడ్డారు.

 ప్రమాద తీవ్రత గురించి ప్రావిన్స్ చీఫ్ మినిస్టర్ అలీ అమీన్ గండాపూర్ మాట్లాడారు. ఇటువంటి క్లిష్ట సమయంలో బాధితులను ఒంటరిగా విడిచిపెట్టమని వారిని ఆదుకుంటామని తెలిపారు. గ్వాదర్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదనీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో అవి కుప్పకూలిపోయాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 గ్వాదర్  తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తడంతో నైరుతి బలూచిస్తాన్​లో ఐదుగురు మరణించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌లో కూడా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ అథారిటీ(ఎన్​డీఎమ్​ఏ) తెలిపింది. హైవేలపై పేరుకుపోయిన చెత్త తొలగించేందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తోంది. వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో పాక్-–చైనాను కలిపే కారకోరం హైవే చాలా చోట్ల దెబ్బతింది.