చెరువులకు జలకళ..యాదాద్రి జిల్లాలో సగానికిపైగా చెరువుల్లో 50 శాతం నీరు

చెరువులకు జలకళ..యాదాద్రి జిల్లాలో సగానికిపైగా చెరువుల్లో 50 శాతం నీరు
  •  3 నెలల్లో 36 రోజులూ వానలే 
  •   20 రోజుల్లోనే కరువు తీరా వాన
  •   6 శాతం లోటు నుంచి 83 శాతం ఎక్సెస్​ 
  •   253 చెరువుల్లో సర్​ప్లస్​వాటర్ 

యాదాద్రి, వెలుగు : 20 రోజుల క్రితం వరకు యాదాద్రి జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జులై రెండో వారం నుంచి అడపాదడపా వానలు కురిశాయి. అయినప్పటికీ జూలై నెలాఖరు వరకు లోటు వర్షపాతం నమోదు అయింది. జూన్​ నుంచి జులై, ఆగస్టు 1 వరకు 242.4  ఎంఎం వాన కురియాల్సి ఉంది. అయితే 226.8 ఎంఎం మాత్రమే కురియడంతో 6 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయింది. వానలు సరిగా పడకపోవడంతో జిల్లాలోని చెరువుల్లో నీరు చేరలేదు. 1155 చెరువులు ఉండగా 30 నుంచి 40 చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి నీరు చేరింది. అవి కూడా మూసీ పరిధిలోని చెరువుల్లోనే నీరు చేరింది. 

253 చెరువుల్లో సర్​ప్లస్ వాటర్..

జిల్లాలో మూసీ తప్ప మరో నది ప్రవాహం లేనందున బోరు బావులు, బావులు, చెరువుల మీద ఆధారపడి ఎక్కువ మంది రైతులు పంట సాగు చేస్తున్నారు. ఇరిగేషన్​డిపార్ట్​మెంట్ లెక్కల ప్రకారం యాదాద్రి జిల్లాలో కుంటలు సహా 1155 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే వానాకాలం ప్రారంభమైన తర్వాత జూన్, జులైలో సరైన వానలు పడకపోవడంతో ఆగస్టు 9 వరకు జిల్లాలోని 60 చెరువుల్లో వంద శాతం నీరు చేరగా, కొన్ని చెరువుల్లో చుక్క నీరు కూడా చేరలేదు. ఆగస్టు 3 నుంచి రెగ్యులర్​గా వానలు కురుస్తుండడంతో చెరువులకు జలకళ సంతరించుకుంది. జిల్లాలోని సగానికిపైగా చెరువుల్లో 50 శాతం నుంచి వంద శాతానికి పైగా నీరు చేరింది. గంధమల్ల సహా 253 చెరువులు మత్తడి దుంకుతున్నాయి.  

జిల్లాలో చెరువుల సంఖ్య, నీరు చేరిన శాతం

జిల్లా    చెరువులు    10-25%    25-50%    50-75%    75-100%    100+
యాదాద్రి    1155    282    223    192      205    253

ఈ సీజన్​లో 36 రోజులూ వానలే..

వానాకాలం సీజన్​ ప్రారంభం జూన్ నుంచి అప్పుడప్పుడు కురిసిన వానలు ఆగస్టు 3న మొదలయ్యాయి. అప్పటి నుంచి దాదాపు ప్రతిరోజూ జిల్లాలో రెగ్యులర్​గా వానలు కురుస్తున్నాయి. ఆత్మకూరు, మోటకొండూరు, ఆలేరు, అడ్డగూడూరు, భువనగిరి, యాదగిరిగుట్ట, రాజాపేట సహా పలు మండలాల్లో వర్షం ఎక్కువగా కురిసినట్టుగా నమోదైంది. ఈ సీజన్​ప్రారంభం నుంచి అంటే జూన్​1 నుంచి ఇప్పటివరకు 90 రోజుల్లో 36 రోజులు వానలు కురిసినట్టుగా వాతావరణశాఖ లెక్కలు చెబుతున్నాయి.

 ఈ పరిణామాలతో లోటు నుంచి అత్యధిక వర్షపాతం నమోదైంది. లెక్క ప్రకారం ఇప్పటివరకు 361.1 మిల్లీ మీటర్ల వాన కురియాల్సి ఉండగా, 659.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన 83 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదై నాగర్​కర్నూల్, మెదక్​తర్వాత మూడో స్థానంలో నిలిచింది.