ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..ఇళ్లలో చేరిన వరదనీరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..ఇళ్లలో చేరిన వరదనీరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 10) కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ముంపు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం తీవ్రతకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు పొంగిపొర్లి పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. పలు గ్రామాల్లో రహదారులు జలమయమై రవాణా అంతరాయం ఏర్పడింది.

నిర్మల్ జిల్లా అక్కపూర్‌లో ఎప్పుడూ లేనంతగా 10.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 7.2 సెం.మీ. వర్షం కురిసింది. ప్రత్యేకించి ఇచ్చోడ మండల కేంద్రంలో గంటపాటు కురిసిన భారీ వర్షం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

ఇచ్చోడలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి, దుకాణాల్లోకి వరదనీరు చేరింది. ప్రధాన రహదారులు ముంపులో చిక్కుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగుకాలువల నిర్వహణ సరిగా లేకపోవడమే వరదనీరు ఇళ్లలోకి చేరడానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా ముంపు సమస్య తలెత్తుతున్నా గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గత కొన్నేళ్లుగా మురుగుకాలువలు శుభ్రపరిచే పనులు సరిగా జరగడం లేదు. మౌలిక వసతులు మెరుగుపర్చకపోతే ఈ సమస్యలు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టాలని, శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.