
వరంగల్: వరంగల్ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మరీ ముఖ్యంగా.. వరంగల్ నగరంలో వర్షం దంచికొట్టింది. వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, శివ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరింది. గోకుల్ నగర్, శాంతి నగర్, కాలనీలకు ముంపు ముప్పు పొంచి ఉంది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయార్ధం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లకు (వరంగల్ జిల్లా 1800 425 3434, 9154225936, హనుమకొండ జిల్లా 1800 425 1115, GWMC 1800 425 1980, 9701999676) కాల్ చేయాలని అధికారులు సూచించారు.
వరంగల్ నగరంలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి ఉంది. కరీమాబాద్, రంగశాయిపేట, కాశీబుగ్గ ప్రాంతాలు మోకాళ్ల లోతు వరద నీళ్లలో కూరుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి వరద నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92.9 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
వరంగల్ సిటీలో మంగళవారం కుండపోత వర్షం#Warangal #HeavyRainfall #TelanganaWeatherMan pic.twitter.com/XYrmSG0e1P
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) August 12, 2025