ఏపీ వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. డిసెంబర్ 4,5 భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీ వైపు దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. డిసెంబర్ 4,5 భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ డిసెంబర్ 5న ఏపీలో తీరం దాటనుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్ గా మరిందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొంది. 80, 90 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. 

తుఫాన్ ప్రభావంతో ఒడిశా, ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఆయా రాష్ట్రాల అధికారులను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. 

మిచౌంగ్ తుఫాన్ ఉత్తర వాయవ్యంగా పయనించి బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా రానుంది. ఆ తరువాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 5న ఉదయానికి ఒంగోలు- మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర తుఫాన్‌ తీరం దాటేటప్పుడు దక్షిణకోస్తాలో, ఉత్తరకోస్తాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

గాలుల తీవ్రత నేపథ్యంలో దక్షిణ కోస్తాలో తీవ్ర తుఫాన్‌ తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు మీటరు నుంచి మీటన్నర ఎత్తు వరకు ఎగిసిపడతాయని తెలిపింది. ఈ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.