వరద బురద.. సమస్య తీరదా.. చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీరు

వరద బురద.. సమస్య తీరదా.. చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద  నిలిచిన వర్షపు నీరు
  • హైదరాబాద్ విజయవాడ హైవేలో భారీగా ట్రాఫిక్ జామ్

చిట్యాల, వెలుగు: హైదరాబాద్ విజయవాడ మధ్య  చిట్యాల రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. హైవేపై రెండు నుంచి మూడు అడుగుల మేర వరద నీరు నిలిచి  ఉంది.రైల్వే బ్రిడ్జి కింద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరద నీరు తొలగించేందుకు అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. శనివారం పోలీసులు బ్రిడ్జి వద్దకు చేరుకుని బ్రిడ్జి కింద ఉన్నా వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తరలించారు. 

అయినా నీరు వస్తుండడంతో బ్రిడ్జి కింద వరద నీటిలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ సమయంలో కారు నీటిలో పాడై ఆగిపోయింది. అటుగా వెళుతున్న ఆటో నీటిలో ఇరుక్కుపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న మునుగోడు ఎస్సై రవి తన సిబ్బందితో కలిసి బురదలోకి దిగి ఆటోని బయటకు తోశారు. రోడ్డుపై వాహనాలు అధికంగా రావడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలను చిట్యాల మండలం పెదకాపర్తి నుంచి రామన్నపేట వైపుగా తరలించారు. పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మిస్తుండడంతో అక్కడ 4 నుంచి 5 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి.