ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి : హేమంత్ సహదేవరావు

ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి : హేమంత్ సహదేవరావు

ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆసిఫాబాద్​కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాము కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన ఉప్పరి విజయలక్ష్మి, ఉప్పరి తిరుపతి, బార్ల బానక్క, ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన ఎన్.బాబురావు వేర్వేరుగా దరఖాస్తులు అందజేశారు.

రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాదాసు కిష్టయ్య తన తండ్రి నుంచి తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని తమ పెద్దన్న పేరిట నమోదు చేశారని, దీనిని సవరించి ముగ్గురు అన్నదమ్ములకు సమాన వాటా ఇప్పించాలని కోరారు. వివిధ సమస్యలపై ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్​లోని కలెక్టరేట్​లో బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 

ప్రజావాణికి స్పందన కరువు

జన్నారం: జన్నారం మండల కేంద్రంలోని ఏంపీడీఓ మీటింగ్ హల్​లో నిర్వహించే ప్రజావాణికి స్పందన కరువైంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం 12 గంటలు దాటినా ఆఫీసర్లు హాజరు కాలేదు. కేవలం ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవిత, ఏంఈఓ, ఏంపీడీఓ ఆఫీసుల నుంచి జూనియర్ అసిస్టెంట్లు మాత్రమే హాజరయ్యారు. కేవలం మొక్కుబడిగా మాత్రమే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.