సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ

సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ

ఖమ్మం/ పెనుబల్లి, వెలుగు: సంక్రాంతి పండుగ కోసం కోడి పుంజులు రెడీ అవుతున్నాయి. కోడి పందేలకు ఢీ అంటున్నాయి. పండుగకు ఇంకా మూడు వారాల టైమ్ ఉన్నప్పటికీ, ఇప్పటికే ట్రైనింగ్ తీసుకుంటున్నాయి. ఏపీ సరిహద్దుగా ఉన్న ఊర్లలోని మామిడి, పామాయిల్, కొబ్బరి తోటల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇతర కోళ్లతో కలవనీయకుండా ఏర్పాటు చేసిన షెడ్లలో కోడి పుంజులకు స్పెషల్​ ట్రైనింగ్ ఇస్తున్నారు. కత్తులు కట్టకుండా, కేవలం ప్రాక్టీస్  కోసం ఫైటింగ్  చేయిస్తూ పందెం కోసం వాటిని ప్రిపేర్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కోడి పుంజులను కొనుక్కొని వెళ్తున్నారు. ఒక్కో కోడి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు రేటు పలుకుతున్నట్లు పెంపకందారులు చెబుతున్నారు. 

పందెం కోళ్లపై ప్రత్యేక శ్రద్ధ..

సాధారణ కోళ్ల పెంపకానికి, పందెం కోళ్ల పెంపకానికి చాలా తేడా ఉంటుంది. పందెం కోళ్లు చూడటానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగిలిన వాటితో వీటిని కలవనివ్వరు. పందెం కోళ్లలో 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చ కాకి, పర్ల, సేతువా, పూల, పింగళి, కౌజు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నవల ఇలా చాలానే పేర్లున్నాయి. వీటిలో కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులు పందేలకు పెట్టింది పేరు. సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే పందెం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏడాదిన్నర వయసు ఉన్న పుంజును ఎంచుకొని ప్రత్యేక బుట్టలో ఉంచి దానికి సకల మర్యాదలు చేస్తారు.పెట్టలతో తిరగనియ్యకుండా సజ్జలు, మటన్  కీమా, జీడిపప్పు, బాదం, పచ్చ సొన తీసిన కోడి గుడ్డు, రివైటల్ టాబ్లెట్లు, 18 రకాల దినుసులు కలిపిన లేహ్యం తినిపిస్తారు. కొవ్వు పట్టకుండా వేడి నీళ్ళలో వేప, జామ, వెదురు ఆకులు, పసుపు కలిపి మరగబెట్టి గోరు వెచ్చని నీటితో కోళ్ళకు స్నానం చేయిస్తారు. ఇలా రెండునెలల పాటు క్రమం తప్పకుండా పెంచి, పందేనికి వారం ముందు తేలికపాటి ఆహారం తినిపిస్తారు.

ఏపీ సరిహద్దుల్లో సీక్రెట్​గా పందేలు..

ఏపీలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సమయంలో కోడి పందేలు జోరుగా జరుగుతాయి. తోటల్లో ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తారు. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు, పందెం రాయుళ్లు వచ్చి రూ.లక్షల్లో పందేలు కాస్తారు. సంక్రాంతి పండుగ మూడ్రోజుల్లో ఒక్కో బరిలో రూ. వందల కోట్లు చేతులు మారతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏపీని ఆనుకొని ఉన్న అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కూడా ఈ కోడి పందేల ప్రభావం ఉంటుంది. సరిహద్దుల్లోని తోటల్లో సీక్రెట్ గా పందేలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొద్దిరోజుల నుంచి హడావుడి కొనసాగుతోంది. పండుగ సమయాల్లో ప్రతి ఏటా కొన్ని చోట్ల పోలీసులు దాడులు చేసి పందెం రాయుళ్లను అరెస్ట్  చేస్తున్నప్పటికీ వారు మాత్రం వెనక్కితగ్గడం లేదు. కోడి పందేలు తరతరాల సాంప్రదాయం అని, పోలీసులు ఆపినంత మాత్రాన తగ్గేది లేదని పందెం రాయుళ్లు  చెబుతున్నారు. 

పందెం పుంజులకు మస్తు గిరాకీ

సంక్రాంతి సీజన్  వచ్చిందంటే పందెం కోళ్లకు మస్తు గిరాకీ ఉంటుంది. ఏడాది ముందు నుండే పందెం కోళ్లకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తాము. ఫుడ్ విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. ఏపీ సరిహద్దు ఉండడంతో అక్కడి నుంచి పందెంరాయుళ్లు వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. పందెం కోళ్లు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతున్నాయి. కోడి కలర్, జాతిని బట్టి దాని పోటీ తీరు ఉంటుంది. దాని ఆధారంగా రేట్  పలుకుతుంది.
- యడ్ల సుబ్బారావు, పందెం కోళ్ల పెంపకందారు