ఆమె బలగం 85 మంది.. అవ్వకు వందో బర్త్​డే సెలబ్రేషన్స్

ఆమె బలగం 85 మంది.. అవ్వకు వందో బర్త్​డే సెలబ్రేషన్స్
  • అవ్వకు వందో బర్త్​డే సెలబ్రేషన్స్
  • 20 ఏండ్ల తర్వాత ఒక్కచోట చేరిన కుటుంబసభ్యులు
  • బలగం సినిమా ఎఫెక్ట్​

మెదక్ (నిజాంపేట), వెలుగు: కాలుష్యం, రోగాలు, ప్రమాదాల బారిన పడి ఈ రోజుల్లో 60 ఏండ్లు బతకడం కూడా గగనమే. కానీ, ఓ అవ్వ వందేండ్లు బతికింది. దీన్ని అరుదైన విషయంగా భావించిన ఆమె కుటుంబసభ్యులంతా కలిసి వందేండ్ల వేడుకను ఘనంగా నిర్వహించారు.  దీని కోసం వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కడిక్కడో స్థిరపడ్డ వారంతా ఒక్కచోట చేరారు. మెదక్ ​జిల్లా కౌడిపల్లి మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన పోరండ్ల పద్మాబాయికి తొమ్మిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వీరి భర్తలు, భార్యలు, కొడుకులు, బిడ్డలు, కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు, మునిమనుమలు అంతా కలిపి 85 మంది దాకా ఉన్నారు.

పద్మాబాయి ఆదివారం 99 ఏండ్లు పూర్తి చేసుకుని  వందో ఏడాదిలోకి అడుగు పెట్టింది. దీంతో ఎక్కడెక్కడో ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్​అందరూ కలిసి ఆదివారం నిజాంపేట మండలం చల్మెడలోని పురాతన తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద పద్మాబాయి బర్త్​డే వేడుకలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ బిజీ లైఫ్​లో అందరం ఒకేచోట కలవడం తక్కువని, తమ కుటుంబానికి మూలమైన అవ్వ వందేండ్ల బర్త్​డే సందర్భంగా 20 ఏండ్ల తర్వాత కలుసుకున్నామన్నారు. ఇటీవల వచ్చిన బలగం సినిమా చూసిన తర్వాత కలవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.