హ్యాకర్ల బారిన పడకుండా సెక్యూరిటీ టిప్స్‌‌

హ్యాకర్ల బారిన పడకుండా సెక్యూరిటీ టిప్స్‌‌

‘‘పరమేష్​కు ఒక రోజు రిలేటివ్స్‌‌, ఫ్రెండ్స్‌‌నుంచి చాలా ఫోన్‌‌ కాల్స్‌‌ వచ్చాయి. కాల్‌‌ చేసినవాళ్లంతా ‘హాస్పిటల్‌‌లో ఉన్నావా. నీ హెల్త్‌‌కి ఏం అయింది? అకౌంట్‌‌కి పదివేలు పంపించా. సరిపోకపోతే మళ్లీ అడుగు’ అన్నారు. కొంతసేపు ఏం అర్థం కాలేదు పరమేష్‌‌కు. తర్వాత ఆరా తీస్తే తన పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్‌‌ అయిందని తెలిసింది. ‘కష్టాల్లో ఉన్నా’ అని చెప్పి ప్రతీ ఒక్కరిని డబ్బులు అడుగుతున్నారు వాళ్లు. మహేష్‌‌కి ఇలానే జరిగింది. తన అకౌంట్‌‌ని ఎవరో హ్యాక్ చేసి, చాటింగ్‌‌లో డబ్బులు అడిగారు. ఇవేకాకుండా  సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని బ్లాక్‌‌మెయిలింగ్‌‌, కిడ్నాప్‌‌, ఫొటో మార్ఫింగ్‌‌, రూమర్‌‌‌‌ క్రియేషన్‌‌, ఫేక్‌‌ న్యూస్ స్ప్రెడ్‌‌ లాంటివి చేస్తున్నారు హ్యాకర్లు. 

సోషల్ మీడియా అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. దేశంలో దాదాపు 50 శాతానికి పైగా జనాభా సోషల్ మీడియా యాప్స్‌‌ వాడుతున్నారు. ఇవి ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదం కూడా. కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదికి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కారణం హ్యాకర్లు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోషల్ మీడియా అకౌంట్స్‌‌ హ్యాక్ అవుతూనే ఉన్నాయి. వీటి నుంచి బయటపడేందుకు కొన్ని సెక్యూరిటీ టిప్స్‌‌.

  • చాలామంది సులువుగా గుర్తుపెట్టుకోవచ్చని ఈజీగా ఉండే పాస్‌‌వర్డ్స్‌‌ పెట్టుకుంటారు. అంటే ‘పేరు123’, ‘54321’ అని సెట్ చేసుకుంటారు. యూజర్‌‌‌‌ ఐడి తెలిస్తే ఈ పాస్‌‌వర్డ్స్‌‌తో అకౌంట్‌‌ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అందుకే ఎవరికి అంతు పట్టని విధంగా ఉండే పాస్‌‌వర్డ్స్‌‌ పెట్టుకోవాలి.
  • ఫేస్‌‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌‌లను ప్రైవేట్‌‌లో పెట్టుకోవాలి. దీనివల్ల పోస్ట్‌‌ చేసే ఫొటోలు, చెప్పే విషయాలు ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీ మాత్రమే చూస్తారు. దానివల్ల ఫోటో మార్ఫింగ్‌‌ ప్రమాదంనుంచి తప్పించుకోవచ్చు. 
  • కొంతమంది న్యూస్‌‌ ఫీడ్‌‌లో వచ్చే మీమ్స్‌‌, ఫేవరెట్‌‌ స్టార్‌‌‌‌ పోస్ట్‌‌లకింద కామెంట్‌‌లు పెడతారు. ఫ్రెండ్స్‌‌ని ట్యాగ్ చేస్తుంటారు. అలా చేసినా సోషల్‌‌ మీడియా అకౌంట్ ప్రమాదంలో పడ్డట్టే. అంటే మీ అకౌంట్‌‌ని హ్యాకర్లకు చూపిస్తున్నట్టు. ఆ కామెంట్‌‌ సాయంతో మాటలు కలిపి, డిటేయిల్స్‌‌ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
  •  తెలియని వాళ్లతో ఎప్పుడు చాట్ చేసినా ఆ చాటింగ్‌‌ని డిజప్పియరింగ్‌‌ మెసేజ్‌‌ మోడ్‌‌లో పెట్టుకోవాలి. లేదంటే ఆ చాటింగ్‌‌ని స్క్రీన్ షాట్‌‌ తీసి, ఎడిట్‌‌ చేసి బెదిరించే ప్రమాదం ఉంటుంది.
  • ఈ మధ్య స్నాప్‌‌, స్టోరీల్లో ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా లేదా రోజులో చేసే ప్రతీ విషయాన్ని అందులో పోస్ట్ చేస్తుంటారు చాలామంది. దానివల్ల మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్లకు మీరు వేసే ప్రతీ స్టెప్ తెలిసిపోతుంది. అది కిడ్నాపింగ్‌‌కి, ఇంట్లో దొంగతనం జరిగేందుకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే స్నాప్‌‌, స్టోరీలని ఫ్రెండ్స్ మాత్రమే చూసేలా పర్మిషన్ ఇవ్వాలి.
  • చాలామంది సోషల్ మీడియా అకౌంట్స్‌‌కి జి– మెయిల్‌‌ని లింక్ చేసి ఉంటారు. దానివల్ల కూడా పర్సనల్ డేటా హ్యాక్  అయ్యే ప్రమాదం ఉంటుంది. దీన్నే ఫిషింగ్ అటాక్‌‌, ఫిషింగ్ స్కామ్ అంటారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ యాడ్‌‌, లింక్స్‌‌ని క్లిక్‌‌ చేస్తూపోతే ఈ ప్రమాదం ఎదురవుతుంది. అంతేకాకుండా టెక్స్ట్‌‌ మెసేజ్‌‌లకి వచ్చిన తెలియని లింక్స్‌‌ ఓపెన్ చేసినా ఫిషింగ్ అటాక్‌‌ బారిన పడతారు. 
  • ఫ్రీగా, పాస్‌‌వర్డ్‌‌ లేకుండా దొరికే వైఫైలను అస్సలు నమ్మొద్దు. వాటిని కనెక్ట్‌‌ చేసుకుంటే ఫోన్ ఐపి అడ్రస్ తెలుసుకొని ఫోన్‌‌ని హ్యాక్‌‌ చేయొచ్చు.
  • చాలామందికి తెలియని అకౌంట్‌‌లనుంచి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్‌‌లు వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో సగానికి పైగా ఫేక్ అకౌంట్‌‌లనుంచే వస్తుంటాయి. వాటిని పొరపాటున యాక్సెప్ట్‌‌ చేస్తే ప్రమాదంలో పడినట్టే. దానివల్ల మీ పర్సనల్‌‌ డేటా అంతా హ్యాకర్లకు తెలిసిపోతుంది. ఆ డిటేయిల్స్‌‌తో, ఫొటోలతో ఫేక్ అకౌంట్స్‌‌ కూడా క్రియేట్ చేయొచ్చు.