ఫిరాయింపులతో..దిగజారుతున్న విలువలు

ఫిరాయింపులతో..దిగజారుతున్న విలువలు

రాజకీయాలు రాను రాను కలుషితమై, నేరపూరితమైపోయాయని మేధావులు, రాజనీతిజ్ఞులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేవిధంగా ఉండాలి.  ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అయితే, మన దేశంలో నేరపూరిత రాజకీయాల వల్ల మన ప్రజాస్వామ్యం అభాసుపాలవుతున్నది. అందులోనూ నేరస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు,  ప్రభుత్వ అధికారుల మధ్య నెలకొన్న అపవిత్ర సంబంధం మన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారింది.

స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలకు, వర్తమాన రాజకీయాలకు ఊహించలేనంత వ్యత్యాసం కనపడుతున్నది.  ఆనాడు రాజకీయాల్లో ప్రవేశించినవారు నిస్వార్థంతో  దేశ సేవ,  ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా ఉండేవారు. ప్రజల సంక్షేమం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. మాతృభూమి కోసం, విదేశీ పాలన విముక్తి కోసం నిరంతరం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన ఆదర్శప్రాయులు. రాజకీయాలకు, సామాజిక సేవకు తమ జీవితాలను నాయకులు అంకితం చేశారు.

భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ప్రజల చేత, ప్రజల కోసం, పాలకులను ఎన్నుకునే దేశంగా వర్ధిల్లుతున్నది. మన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఇచ్చింది. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులను పాలకులుగా ప్రజలే ఎన్నుకుంటున్నారు. కానీ, రాజకీయ పార్టీలు, నాయకుల వ్యక్తిగత స్వార్ధంతో  ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైపోతున్నది.

యథార్థ రాజకీయం మనుగడే కష్టమైపోతుందనే సత్యాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.  ఒకసారి తమకు దక్కిన అధికారం ఎప్పటికీ తమతోనే ఉండాలని కోరుకుంటూ అనేకమంది నాయకులు అనేక కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతూ నియంతృత్వ ధోరణికి దారితీస్తున్నది. అధికారం చేయి దాటిపోవడం జీర్ణించుకోలేనివారు తమ తర్వాత కొడుకు, కూతురు, భార్య లేదా కోడలును నేతలుగా మారాలని కుటుంబ పాలనకు పునాదులు వేస్తున్నారు. ఇక్కడే ప్రజాస్వామ్యంపై వేటుపడుతున్నది. అధికారమే పరమావధిగా,  గెలుపే లక్ష్యంగా అడ్డదారిలో అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు.  కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, దౌర్జన్యంతో నాయకులుగా చెలామణి అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవిని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు.

 రాజకీయాలపై సన్నగిల్లుతున్న విశ్వాసం 

 చట్టసభలు ప్రజావ్యతిరేక దిశగా పయనించడానికి ప్రధాన కారణం రాజకీయ రంగంలోకి నేరస్తులు ప్రవేశించడమే. మన రాజకీయాలు ఎంతగా నేరపూరితమయ్యాయంటే  రాజకీయం, నేరం మధ్య  విడదీయరాని బంధం పెనవేసుకొనిపోయింది. నిజాయతీపరులు రాజకీయాలలో ప్రవేశించడానికి తావు లేకుండా పోయింది. రాజకీయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది.  ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈ నేరపూరిత రాజకీయాలు పెనుముప్పుగా మారాయి. అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే ముందు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవ్వాలి. సామాన్యులు, నిజాయతీపరులు ఈ ఎన్నికల్లో  నెగ్గే పరిస్థితి చాలాచోట్ల కనిపించడంలేదు.  

అందుకు ప్రధాన కారణాలు  డబ్బు, దౌర్జన్యం.  వీటిద్వారా ఎన్నికల్లో గెలిచేది అక్రమార్కులు, నేరస్తులే.. అందుకే  ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వారికే సీట్లు ఇస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో  గెలిచే శక్తి ఉన్నవారు ఎటువంటివారైనా వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే సంస్కృతిని సంతరించుకున్నాయి. దేశంలోని అన్ని పార్టీలు ఇదే సంస్కృతికి అలవాటు పడ్డాయి. నేరస్తులు రాజకీయ నాయకులుగా అవతారమెత్తుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఈ నేరపూరిత రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులుగా మారిన నేర చరిత్రుల సంఖ్య పెరుగుతున్నది.

డబ్బుతో రాజకీయ వ్యాపారం

డబ్బున్నవారు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడం లేదా పెంచుకోవడానికి తమ అనుకూల అభ్యర్థులు ఎన్నికల్లో  గెలిచేందుకు కృషి చేస్తున్నారు. వారిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.1991 నుంచి  ప్రభుత్వం అవలంబిస్తున్న సరళీకరణ, నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా కార్పొరేట్​ శక్తులు రాజకీయాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల్లో పాల్గొంటూ కోట్ల డబ్బు ఖర్చు చేస్తూ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి.  

ఆ కారణంగానే 11వ లోక్​సభ నుంచి సభలో  కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ.. 17వ లోక్​సభ నాటికి వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 17వ లోక్​సభకు ఎన్నికైన అభ్యర్థుల ఆస్తులను పరిశీలిస్తే వారి ఆస్తులు వందల, వేల కోట్లలో ఉన్నాయి. పెరిగిపోతున్న క్రోనీ క్యాపిటలిజం రూపుమాపటానికి పటిష్టమైన లోకాయుక్త అవసరం. సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలపై రాజకీయ ప్రభావం లేకుండా పటిష్టం చేయాలి.

అధికారమే ఏకైక లక్ష్యం

నేటి రాజకీయాల ఏకైక లక్ష్యం అధికారాన్ని సాధించడం.' తిమ్మిని బమ్మి. బమ్మిని తిమ్మిని' చేసి అయినా సరే అధికారాన్ని సాధించటం. చేపట్టిన అధికారం ద్వారా అంతులేని సంపాదన. ఇదే నేటితరం రాజకీయ నాయకుల లక్ష్యాలుగా మారాయి. అధికారం అంతిమ లక్ష్యంగా రాజకీయం దానిని సాధించడానికి ఉపయోగపడే సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రజాసేవను విస్మరించి దురదృష్టవశాత్తు నేటి రాజకీయాలు ఈ దుస్థితికి చేరుకున్నాయి. పార్లమెంటరీ విలువలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన కాలంలో ముఖ్యంగా 70ల వరకు శాసనసభల్లో, పార్లమెంటు ఉభయ సభల్లో చాలా ఉన్నతంగా చర్చలు, వాదోపవాదాలు  జరిగాయి.

ఎంతో హుందాగా సహజసిద్ధమైన హాస్యోక్తులు, ఛలోక్తులతో ఉత్తేజకరమైన వాదోపవాదాలు జరిగేవి. ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులపై విమర్శలకు దిగకుండా కేవలం తమ అభిప్రాయాన్ని, వాదనను శక్తిమంతంగా, విశ్లేషణాత్మకంగా వినిపించేవారు. చట్టసభల వార్తలు చదవడానికి,  వినడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపేవారు.  చర్చలు విజ్ఞానాత్మకంగా ఉండేవి.  నేటి చట్టసభలను తలుచుకోవాలంటేనే అనాసక్తి. మన శాసనసభలు, పార్లమెంటు సభలు పరస్పర దూషణలకు, బల ప్రదర్శనకు వేదికలయ్యాయి. ఇటీవల లోక్​సభ, శాసనసభలలో జరుగుతున్న అల్లర్లు అప్రజాస్వామ్యానికి అద్దం పడుతున్నాయి.

ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్​ నాయకుడు