హీరో నాగచైతన్య, సమంత విడాకుల ఇష్యూపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ప్రముఖ సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన నాగచైతన్య.. తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’’ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను నాగచైతన్య కూడా రీట్వీట్ చేసి.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read :- మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.
మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే అక్కినేని అమల, సమంత సైతం స్పందించారు. నా విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని సమంత సూచించారు. నా విడాకులు పరస్పర అంగీకారం సామరస్యపూర్వకంగా జరిగాయని తెలిపిన సామ్.. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరని.. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నానని మంత్రి కొండా సురేఖకు హితవు పలికింది.
‘‘మహిళా మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. రాజకీయ వివాదాల్లోకి మా ఫ్యామిలీని లాగడం సరికాదు. మా కుటుంబానికి మంత్రి క్షమాపణ చెప్పాలి. నా భర్త నాగార్జున గురించి నిరాధారమైన ఆరోపణలు చేశారు. రాజకీయ నాయకులు ఇంతటి నీచానికి దిగజారితే దేశం ఏమైపోతుంది. రాహుల్ గాంధీకి మానవత్వం ఉంటే మీ మంత్రులను అదుపులోకి ఉంచండి’’ అంటూ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై అక్కినేని అమల ఘాటుగా రియాక్ట్ అయ్యారు.