విడాకుల పుకార్లను ఖండించిన హీరో శ్రీకాంత్

విడాకుల పుకార్లను ఖండించిన హీరో శ్రీకాంత్

హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నటుడు శ్రీకాంత్ స్పందించారు. ఈ పుకార్లను  ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను...!?  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను చనిపోయినట్లుగా వదంతులు పుట్టించి తన కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారన్నారు. ఇప్పుడు తాజాగా తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా  విడాకులు తీసుకుంటున్నామంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారని మండిపడ్డారు. కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన  ఈ ఫేక్ న్యూస్ ను  తన ఫ్రెండ్స్  ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తాను కంగారుపడుతూ ఆ పోస్టులను తనకు చూపించిందని శ్రీకాంత్ తెలిపారు.

ఇలాంటివి ఏమాత్రం నమ్మొద్దని....ఆందోళన పడొద్దని తనను ఓదార్చానని శ్రీకాంత్ చెప్పారు. అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి   అడుగుతుంటే వివరణ  ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుందన్నారు. ప్రస్తుతం తానూ, ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నామన్న ఆయన.. ఇలాంటి తరుణంలో ఈ పుకారు తమ కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం  ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నానని స్పష్టం చేశారు. తన మీదనే కాకుండా  చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని హీరో శ్రీకాంత్ డిమాండ్ చేశారు.