గామి.. నాకొక సాహస యాత్ర

గామి.. నాకొక సాహస యాత్ర

‘గామి’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చే అద్భుతమైన సినిమా అని చెబుతోంది హీరోయిన్ చాందిని చౌదరి. విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ ‘‘గామి’ అంటే తాను అనుకున్న గమ్యాన్ని గమించేవాడు. ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ప్రయాణం నాకొక సాహస యాత్రలా జరిగింది. కథ విన్నప్పుడే సమయం పడుతుందని అర్ధమైంది. వైవిధ్యమైన వాతావరణ పరిస్థితులలో తీసిన సినిమా ఇది.  వారణాసి, కుంభమేళా, కాశ్మీర్, హిమాలయాలు లాంటి రియల్ లొకేషన్స్‌‌లో షూట్ చేశాం.

మా టీమ్‌‌లో  నేను ఒక్కదాన్నే అమ్మాయిని.  అందరం ఒక బస్‌‌లో వెళ్లి సాయంత్రం వరకూ షూటింగ్ చేసి వచ్చే వాళ్ళం. అక్కడ చాలా సవాల్‌‌తో కూడిన పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా వాష్ రూమ్ యాక్సిస్ లేకపోవడం వలన నీరు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల పాటు ఇలా షూటింగ్ చేశాం. గడ్డకట్టిన మంచు పొరల మీద నడిచినప్పుడు పగుళ్ళు వచ్చాయి. పొరపాటున కిందపడితే ప్రాణానికే ముప్పు. అలాంటి సమయంలో నా దగ్గర ఉన్న లగేజ్‌‌ని పారేసి జంప్ చేసి లక్కీగా బయటపడ్డాను. ఐమాక్స్ స్క్రీన్‌‌లో ట్రైలర్ చూసినప్పుడు పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందని ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.

నా మనసుకు తృప్తిని ఇచ్చిన సినిమాగా ‘గామి’ నిలుస్తుంది.  ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా.  ఇక ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి.  ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నా.  ఈ ఏడాది నేను నటించిన నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ మరో సీజన్ కూడా రాబోతుంది’ అని చెప్పింది.