
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ సదస్సు కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్– 2025’ దేశ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక మలుపు తిరిగింది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు – న్యాయం కోసం నడిచే దేశ రాజకీయ యాత్రకు తొలిపదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొన్న ఈ సదస్సు భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు ఒక విశేష గౌరవాన్ని తీసుకొచ్చింది.
ఈ సమ్మిట్ కు ఆత్మగా నిలిచినవారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆయన ప్రసంగం, ఆలోచనల వెనుక ఉన్న నిగూఢ తాత్వికత, చిత్తశుద్ధి ఈ సమిట్‌ను ఒక ఉద్యమంగా మార్చింది. ‘సమాజంలోని వాస్తవాలను అర్థం చేసుకోకపోతే సమానత్వం అనే మాట ఖాళీగా మిగిలిపోతుంది. ఎవరికి ఎంత అభివృద్ధి లభించింది, ఎవరు ఇంకా అన్యాయానికి లోనవుతున్నారు – ఈ విషయాల్లో స్పష్టత అవసరం. కులగణన అనేది గణాంకాల కోసం కాదు, నిజమైన ప్రజాస్వామ్యానికి అవసరమైన అద్దం’ అని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఇది ఆయన వ్యక్తిగత స్థాయిలో కాదు – కాంగ్రెస్ పార్టీ ఆలోచనా దిశకు ప్రతిబింబంగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సు వేదికపై రాష్ట్రాన్ని సామాజిక న్యాయం ప్రయోగశాలగా చిత్రీకరించారు. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వేను దేశానికి మార్గదదర్శకంగా నిలబెట్టారు. ఆయన పేర్కొన్న విధంగా, తెలంగాణలో పాలనకు మార్గదర్శకం వాస్తవిక సమాచారం ఆధారంగా ఉండాలి. కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలు కాకుండా, వాటి ప్రయోజనం ఎవరికెంతగా చేకూరుతోంది అన్న విషయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్న రేఖను ఆయన ఖచ్చితంగా గీసారు. ‘ఇప్పటివరకూ లెక్కలు చూసి పాలన చేసాం, ఇకపై హక్కులు చూసి పాలన చేస్తాం’ అన్న ఆయన మాటలు ఈ సమిట్‌కు తుది రూపం ఇచ్చాయి.
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు సామాజిక న్యాయ పోరాటానికి అంకితమై ఉన్న నాయకుడిగా, ఈ వేదికపై చక్కటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం ప్రజలలో ఉద్రేకం కలిగించడంతో పాటు, సమాజంలో అసమానతలపై వారి అవగాహనను పెంచింది. ‘‘కులగణన అనేది పాతపురాణాల మాదిరిగా చూడకూడదు. అసమానతలను పట్టి చూపించి, వాటికి పరిష్కారం చూపే మార్గం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ భారత్ సమిట్ ముగిసిన కొన్ని రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం ప్రకటించింది. రాబోయే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది దేశ రాజకీయాల్లో గణనీయమైన మలుపు. ఈ నిర్ణయం వెనుక ఉన్న చైతన్యానికి మూలం తెలంగాణలో మొదలైన కులగణన ఉద్యమం. ఆ ఉద్యమానికి బలం ఇచ్చిన సమిట్ వేదిక. ఆ వేదికకు ప్రాణం పోసిన నాయకుడు రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజనీతికంగా, నైతికంగా, ప్రజాపరంగా క్రెడిట్ దక్కాల్సింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి. ఇది రాహుల్ గాంధీ తీసుకున్న అద్భుతమైన దిశ, కాంగ్రెస్ పార్టీ నడిపిన న్యాయ ప్రస్థానం విజయానికి వచ్చిన తొలి ఫలితం.
తెలంగాణలో మొదలైన ఈ ప్రస్థానం, దేశాన్ని ఆత్మపరిశీలన వైపు నడిపిస్తోంది. వాస్తవాలను స్వీకరించే ధైర్యాన్ని కలిగిస్తోంది. సమానత్వాన్ని రాజకీయ ప్రకటనల నుంచి ప్రజల జీవితాల్లోకి తీసుకురావాలని కోరుతోంది. ఇది భారత్‌కు నూతన భవిష్యత్ నిర్మాణానికి వేసిన బలమైన పునాది. కులగణన నుంచి సమానత్వానికి – ఈ మార్గం ఇప్పుడు దేశ పథంగా మారుతోంది.
- యేకుల సురేష్,
సోషల్ వర్కర్