కవర్ స్టోరీ : కెమికల్​ ఫ్రీగా బతకాలంటే

కవర్ స్టోరీ : కెమికల్​ ఫ్రీగా బతకాలంటే

ప్లాస్టిక్​ కవర్లు, బాటిళ్లు, స్పూన్లు.. వీటిలో ఏదో ఒకటి రోజులో ఒక్కసారైనా వాడుతూనే ఉంటారు. నిత్యం వాడే  ఇలాంటి ప్లాస్టిక్​ వస్తువుల వల్ల పర్యావరణానికే కాదు ప్రాణికోటి మనుగడకూ ముప్పే. ఈ విషయంపై ఈ మధ్య కాస్త అవేర్​నెస్​ పెరగడంతో వాటికి బదులుగా ‘ఏమి ఉన్నాయని?’ చూసే వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఒక్క ప్లాస్టికే కాదు అందులో ఉండే థాలేట్స్ వంటి రసాయనాలు కూడా మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం​! 

అని హెచ్చరిస్తున్నారు ఎక్స్​పర్ట్స్​. మరి ప్రమాదకరమైన ఆ థాలేట్స్​ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతున్నాయి అనేది తెలుసుకుంటే మంచిది. అసలు థాలేట్స్​ అంటే ఏంటి? ప్లాస్టిక్​కి థాలేట్స్​కి ఉన్న సంబంధం ఏంటి? అవి ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయి? వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు పూర్తిగా తెలుసుకుంటే ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్లం అవుతాం.

థాలేట్స్ అంటే.. ఒక రకమైన రసాయనాలు. 

వీటి​ని ప్లాస్టిసైజర్లు అని కూడా అంటారు. కొన్ని థాలేట్స్ ప్లాస్టిక్​ని సాఫ్ట్​గా చేస్తాయి. కొన్ని పదార్థాలను కరిగించడంలో సాయపడతాయి. వీటిని ప్లాస్టిక్ మన్నిక కోసం కూడా వాడుతుంటారు. అంటే... ప్లాస్టిక్ ప్రొడక్ట్​ ఏ రకానిది అయినా అందులో థాలేట్స్ ఉంటాయన్నమాట. చిన్నపిల్లల బొమ్మల నుంచి.. పుడ్​ ప్యాకేజింగ్​ కవర్స్, పర్​ఫ్యూమ్స్, లిప్​స్టిక్​, నెయిల్ పాలిష్, కిచెన్ ప్లాస్టిక్, వినైల్​ ఎయిర్ ఫ్రెష్​నర్స్, మెనుస్ట్రువల్ ప్యాడ్స్, డైపర్స్ వరకు అన్నింట్లోనూ థాలేట్స్ ఉంటున్నాయి. అంతెందుకు మెడికల్ ఎక్విప్​మెంట్స్​లో కూడా థాలేట్స్ ఉంటాయి. మొత్తానికి ప్లాస్టిక్​ మాటున దాగి ఉన్న థాలేట్స్​ చాపకింద నీరులా శరీరంలోకి చేరి హెల్త్​ పాడుచేస్తున్నాయి. 

ఫుడ్​  ద్వారా...

థాలేట్స్ అనేవి ముఖ్యంగా ఫుడ్​ నుంచి శరీరంలోకి ఎక్కువగా చేరతాయి అంటున్నారు సైంటిస్ట్​లు. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే డైరీ ప్రొడక్ట్స్​ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్​ ఎక్విప్​మెంట్​ లేదా పాలు తీసే మెషిన్​లో పీవీసీ పైప్స్ లేదా ట్యూబ్స్ వాడతారు. ప్లాస్టిక్​తో తయారైన ఆ పైపులను ఆవు లేదా గేదెల పొదుగుకు పెడతారు. వాటి నుంచి నేరుగా పాల డబ్బాలోకి పాలు పడతాయి. 

ఆ పాలను డైరీ నుంచి ప్రాసెస్ చేసే ప్లాంట్స్​కు పంపిస్తారు. అక్కడ వాటిని ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ప్యాకెట్స్​లో పోసి ప్యాక్ చేస్తారు. ఈ ప్రాసెస్​లో థాలేట్స్​ ఎక్కడైనా కలిసే అవకాశం ఉంది. ఒక్క పాలకే కాకుండా మాంసం, చేపలు, నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినవి తినడం వల్ల కూడా థాలేట్స్​ శరీరంలోకి చేరతాయి. ఇదంతా ఇలా ఉంటే ప్రజలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ ప్రొడక్ట్స్​లో ఎక్కువ మొత్తంలో థాలేట్స్ ఉన్నట్లు ఒక స్టడీలో తేలింది.

అలాగని ఆ ప్రొడక్ట్స్​లో కావాలని థాలేట్స్​ని కలపరు... ఫుడ్ ప్రాసెసింగ్​ చేసేటప్పుడో, ప్యాక్ చేసేటప్పుడో థాలేట్స్ ఈజీగా తప్పించుకుంటాయి. ఎందుకంటే థాలేట్ సమ్మేళనాలు ప్లాస్టిక్ నుంచి విడిపోయి నీళ్లు, ఫుడ్, నేల, గాలిలో ఈజీగా కలిసిపోతాయి. అలా​ సప్లయ్ చేసేలోపులో ఏ దశలోనైనా ఫుడ్ కలుషితం అయిపోతుంది. దీని సంగతి ఇలా ఉంటే.. ఇంట్లో తినే వాళ్లతో పోలిస్తే తరచూ బయట తినే వాళ్ల శరీరంలో థాలేట్స్ ఎక్కువగా ఉన్నట్టు ఈ మధ్య చేసిన ఒక రీసెర్చ్​లో వెల్లడైంది.

ఆర్గానిక్ అయినా..

‘‘వామ్మో! ఇదంతా ఇలా ఉందనే... మేం ఆర్గానిక్​ ఫుడ్​కే ఓటు వేస్తున్నాం’’ అంటున్నారా? నిజమే ఇప్పుడు అంతా ఆర్గానిక్​ ఫుడ్​ ట్రెండ్​ నడుస్తోంది. పలురకాల రసాయనాల బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే చాలామంది ఆర్గానిక్​ ఫుడ్ వైపు మళ్లారు. అయితే, తినేది ఆర్గానిక్ ఫుడ్ అయినా సరే.. దాని ద్వారా కూడా థాలేట్స్ శరీరంలోకి వెళ్తున్నాయి?! అవి ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటున్నారు సైంటిస్ట్​లు. అదెలాగంటే... ఫుడ్​ తయారుచేసేటప్పుడు పీవీసీ గ్లవుస్​​లు వాడడం దానికి మొదటి కారణం. రెండోది తయారుచేసిన ఫుడ్​ను ప్యాక్​ చేసేందుకు వాడే ప్లాస్టిక్​ డబ్బాలు వంటివి. మూడోది ప్యాకింగ్​ మీద ప్రింటింగ్​ కోసం వాడే ఇంక్​ వల్ల ఈ రసాయనాల బారిన పడే ప్రమాదం ఉంది.

ఒకవేళ ప్యాకేజింగ్ అనేది ప్లాస్టిక్ రహితం అయితే... అందుకు ఎక్కువగా కార్డ్​బోర్డ్​ షీట్స్ వాడతారు. మరింకేం.. అవి పేపరే కదా! వాటివల్ల నష్టం ఉండదు అనుకోవచ్చు. కానీ... ఇక్కడా ఒక ట్విస్ట్​ ఉంది. కార్డ్​బోర్డ్​లో కూడా థాలేట్స్ ఉంటాయి. నిజానికి కార్డ్​బోర్డ్​ను కలప నుంచి వచ్చిన పేపర్ ఫైబర్​తో తయారుచేస్తారు. వాటిని ‘వర్జిన్ కార్డ్​బోర్డ్’ అంటారు. వాటివల్ల సమస్య​ లేదు. కానీ, వాటిని రీసైకిల్ చేసినప్పుడే ఇబ్బంది వచ్చి చేరుతుంది. రీసైకిల్ చేసిన కార్డ్​బోర్డ్​ని ఫుడ్ ప్యాకేజింగ్​లో వాడితే థాలేట్స్ ఎక్కువ గాఢతతో ఉంటాయని చెప్తున్నారు ఎక్స్​పర్ట్స్.

 అప్పుడు మొదలైంది

థాలేట్స్​లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఏ రకం కెమికల్ అయినా డేంజరే.1930ల కాలం నాటి నుంచి సైంటిస్ట్​లు థాలేట్స్​ అనే కెమికల్ గ్రూప్​ను రకరకాల ప్రొడక్ట్స్​లో వాడడం మొదలుపెట్టారు.1990 నాటికి థాలేట్స్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గుర్తించారు.  పిల్లలు బొమ్మల్ని నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ కెమికల్స్ నేరుగా శరీరం లోపలికి వెళ్తున్నట్టు 2008లో రీసెర్చర్స్ కనిపెట్టారు. అప్పటి నుంచి థాలేట్స్ ఆరోగ్యానికి చేస్తున్న చేటు గురించిన అవగాహన పెరిగింది. రోజూవారీ జీవితంలో మనం వాడే అనేక వస్తువుల్లో థాలేట్స్ ఉంటున్నట్టు గుర్తించారు. దాంతో ఎన్విరాన్​మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఇపిఎ), ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్​డిఎ), కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ (సిపిఎస్​సి) సంస్థలు థాలేట్స్​ని తగ్గించే దిశగా అడుగులు వేశాయి.

హెల్త్ మీద  ఎఫెక్ట్​

అన్ని రకాల థాలేట్స్​ హెల్త్​ మీద ఒకేలా ఎఫెక్ట్ చూపించవు. కానీ, థాలేట్స్ ఉన్న వస్తువులు వాడడం వల్ల మనుషులు, జంతువులకు రకరకాల హెల్త్​ ప్రాబ్లమ్స్ మాత్రం రావడం ఖాయం. ఆస్తమా, అటెన్షన్ – డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఒబెసిటీ, టైప్​ 2 డయాబెటిస్​, తక్కువ ఐక్యూ, న్యూరో డెవలప్​మెంటల్ ఇష్యూలు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఆటిజం, స్పెక్ట్రమ్ డిజార్డర్స్, రిప్రొడక్టివ్​ డెవలప్​మెంట్​లో మార్పులు, మేల్ ఫెర్టిలిటీ సమస్యలు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్లకు ఇరిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కనీసం రెండు థాలేట్స్ అయినా లివర్​కి లింక్ అయి ఉంటాయి. దానివల్ల లివర్​తోపాటు​, కొన్ని రకాల క్యాన్సర్​లు వచ్చే ప్రమాదం ఉంది.

కొన్నిరకాల థాలేట్స్ ఎండోక్రైన్ సిస్టమ్​ పనిచేయకుండా అడ్డుకునే రసాయనాలుగా పనిచేస్తాయి . ఎండోక్రైన్ సిస్టమ్​లో ఎండోక్రైన్ గ్రంథులు, అవయవాలు హార్మోన్స్​ను తయారుచేస్తాయి. ఆ హార్మోన్లను రక్తంలోకి నేరుగా పంపించేందుకు సాయపడతాయి. శరీరంలోని అన్ని కణజాలాలకు చేరుస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన శరీరంలో కెమికల్ మెసెంజెర్స్​లా పనిచేస్తాయి. అలాంటి వాటి మీద ఎఫెక్ట్ పడితే ఎదుగుదల మీద దెబ్బ పడినట్లే. ‘‘నాలుగు రకాల థాలేట్స్ ఎండోక్రైన్ గ్రంధి పనిచేయకుండా అడ్డుకునే రసాయనాలు’’ అని యూరోపియన్ యూనియన్ 2017లో అధికారికంగా గుర్తించింది.

థాలేట్​ కెమికల్ వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. ఈ కెమికల్​ను సిగరెట్లు, మద్యం వంటి వాటిలో కూడా వాడతారు. శరీరంలోకి వెళ్లే ఏ రసాయనమైనా కణాల నిర్మాణాన్ని మారుస్తుంది. మన బాడీలో ఆరోగ్య, అనారోగ్య కణాలు ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టమ్​ చెడు లేదా అనారోగ్య కణాలను తొలగించడంలో సాయపడుతుంది. కానీ, కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు. దాంతో ఆ కణాలు క్యాన్సర్​కు దారితీస్తాయి లేదా క్యాన్సర్​కు కారణమయ్యే అనారోగ్య కణాలను ఎఫెక్ట్​ చేస్తాయి’’ అని క్యాన్సర్ స్పెషలిస్ట్​లు చెప్తున్నారు. 

పిల్లల్లో ఎదుగుదల లోపాలు

గర్భిణి​గా ఉన్నప్పుడు థాలేట్స్​కి ఎక్స్​పోజ్ అయితే పిల్లల్లో బిహేవియరల్, కాగ్నిటివ్​ ఇష్యూస్ వస్తాయి. అలాగే అటెన్షన్ డెఫిసిట్​ హైపర్​యాక్టివిటీ డిజార్డర్(ఎడిహెచ్​డి)ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల న్యూరో డెవలప్​మెంటల్ డిజార్డర్స్, కోపం, డిప్రెషన్, మందబుద్ధి, ఆటిజం వంటివి పిల్లల్లో కనిపిస్తాయి. పిల్లల్లో బోన్ క్యాన్సర్ రిస్క్ పెంచుతుందని 2021లో ఒక స్టడీలో తేలింది. వీటికి కారణం కెమికల్స్ అని సైంటిస్ట్​లు, డాక్టర్స్ చెప్తున్నారు. 

ఇదంతా చదివినప్పుడు ‘‘మరీ అంత ఎఫెక్ట్ చేసే విధంగా కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్​ ఏం వాడుతున్నాం?’’ అనిపించొచ్చు. మనం రోజూ వాడే వస్తువుల్లోనే కెమికల్స్ ఉంటున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్​లు. ఫుడ్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, ఫుడ్​ ప్యాకింగ్ కవర్స్, వంట పాత్రలు, క్యాన్​లు, 

కార్పెట్​లు, షవర్​ కర్టెన్స్, ఎలక్ట్రానిక్స్, షాంపూలు కూడా కెమికల్​తో ముడిపడినవే. వీటిలో ఆర్గానోఫాస్పేట్స్, థాలేట్స్ వంటి కెమికల్స్ ఉంటున్నాయి. ఈ కెమికల్స్ హార్మోన్లను దెబ్బతీసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్రెయిన్​ మీద ప్రభావం ఉంటుంది. పిల్లల్లో మొదటి తొమ్మిది నెలల్లోపే బ్రెయిన్ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. ఆ టైంలో న్యూరల్ కనెక్షన్స్, సమాచారాన్ని ట్రాన్స్​ఫర్ చేసేందుకు రెడీ అవుతుంటాయి. అలాంటప్పుడు కెమికల్స్ ఎఫెక్ట్​ పడితే.. సమస్యే కదా!

సబ్బులు, షాంపూలు..

తిండి విషయంలో ఈ ఇబ్బంది ఉంటే... మిగతావి వాడటంసేఫేనా అనే అనుమానం వస్తుంది. అవి కూడా ఒకసారి చూసుకుని వాడాల్సిందే. సబ్బులు, షాంపూలు, పర్​ఫ్యూమ్​, వినైల్ ఫ్లోరింగ్​, లూబ్రికేటింగ్ ఆయిల్స్, కండిషనర్, బాడీ స్ప్రే, హెయిర్ స్ప్రే, నెయిల్ పాలిష్​, షవర్ కర్టెన్, మెడికల్ ట్యూబ్స్​, ఐవీ బ్యాగ్స్, వాల్ కవరింగ్స్, ఫుడ్ ప్యాకేజింగ్, కండోమ్స్​లో కూడా ఈ రసాయనాలు ఉంటున్నాయి. 

దాదాపు వందేండ్లుగా ఈ థాలేట్స్​ కెమికల్స్ గ్రూప్​ను ఇంట్లో వాడే వస్తువుల్లో వాడుతున్నారని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. విదేశాల్లో అయితే దాదాపు ప్రతి వ్యక్తి థాలేట్స్ రిలేటెడ్ కెమికల్స్​కి ఎక్స్​పోజ్​ అయ్యే ఛాన్స్ ఉంది. షాంపూ, మేకప్​ ప్రొడక్ట్స్​ వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని తేల్చారు సైంటిస్ట్​లు. షాంపు, మేకప్, ఫుడ్​ స్టోర్​ చేసే కంటెయినర్లు, పర్​ఫ్యూమ్స్​, ఆటబొమ్మలు వంటి ఎన్నో ఉత్పత్తుల్లో హానికర కెమికల్స్ అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంటున్నాయి. 

అవి మనిషిపై ప్రభావం చూపిస్తున్నాయి అని చాలా స్టడీలు చెప్పాయి. న్యూయార్క్​ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతోన్న ‘న్యూయార్క్ యూనివర్సిటీ లాంగాన్​ హెల్త్​ అకాడమీ’కి చెందిన సైంటిస్ట్​లు, ఎక్స్​పర్ట్స్​ గ్రూప్​ ఒక రిపోర్ట్ ఇచ్చింది.  ఆ స్టడీలో 55 నుంచి 64 ఏండ్ల వయసున్న ఐదువేల మంది డేటా పరిశీలించి ఎక్స్​పర్ట్స్ ఒక క్లారిటీకి వచ్చారు. షాంపు, మేకప్ ఇంకా ఇతర వస్తువులు ఎక్కువకాలం నిల్వ ఉండేలా వాటిలో కొన్ని రసాయనాలు కలుపుతారనే విషయం తెలిసిందే. ఆ వస్తువులను వాడినప్పుడు థాలేట్స్​ ఒంట్లోకి ఎంటర్​ అవుతాయి. హార్మోన్ల పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తాయి. దాంతో గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీ వంటివి వస్తాయి. ఐక్యూ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. 

శానిటరీ ప్యాడ్స్​లో కూడా!

సాధారణంగా థాలేట్​ని శానిటరీ ప్యాడ్​ల మన్నిక కోసం వాడతారు. టాక్సిక్ లింక్ రీసెర్చ్ ఆధారంగా ‘ర్యాప్డ్​ ఇన్ సీక్రసీ : టాక్సిక్ కెమికల్స్ ఇన్​ మెనుస్ట్రువల్ ప్రొడక్ట్స్’ అనే రిపోర్ట్​ పబ్లిష్ చేసింది. అందు​లో 24 రకాల ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీల)ను కనిపెట్టారు. వాటిలో జిలీన్, బెంజీన్, క్లోరోఫామ్ వంటివి ఉన్నాయని తేలింది. మనదేశంలో అమ్మే శానిటరీ ప్యాడ్స్ తయారీలో శరీరానికి హాని చేసే థాలేట్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) వంటి కెమికల్స్ వాడుతున్నారు. ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది.

 దేశంలో అమ్ముతున్న10 బ్రాండ్ల శానిటరీ ప్యాడ్​ల మీద స్టడీ చేసింది ఆ సంస్థ. ‘‘యూరోపియన్ యూనియన్ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఒక శానిటరీ ప్యాడ్​ మొత్తం బరువులో 0.1శాతం కంటే ఎక్కువ థాలేట్​ వాడకూడదు. అందుకు అనుగుణంగానే తాము సేకరించిన నమూనాల్లో థాలేట్స్ఈ రూల్​కి లోబడి ఉన్నాయి. అయినప్పటికీ వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. 

ఈ రీసెర్చ్ పెద్ద బ్రాండ్ల పై మాత్రమే జరిగింది. చిన్న బ్రాండ్​లలో ఈ రసాయనాలను మోతాదుకు లోబడి వాడుతున్నారో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనదేశంలో కెమికల్స్​ను ఎంత లిమిట్​లో వాడాలనే సమాచారం క్లియర్​గా లేద’’ని టాక్సిక్ లింక్ చీఫ్ ప్రోగ్రామ్ కో– ఆర్డినేటర్ ప్రీతి మహేశ్​ చెప్పారు. శానిటరీ ప్యాడ్స్​ అనేవి నిత్యవసరాల (బేసిక్​ నీడ్)​ కింద ఉన్నాయి. అందుకని వాటి వాడకం ఆపే పరిస్థితి లేదు. మరెలా? వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్​ ఉంటోందో తెలుసుకోవడం అవసరం.

ఎఫెక్ట్ ఇదే..

మనదేశంలో 35.5 కోట్లకు పైగా బాలికలు, మహిళలు మెనుస్ట్రువల్ పిరియడ్​లో ఉన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 ప్రకారం,15 నుంచి 24 ఏండ్ల వయసున్న ఆడపిల్లల్లో 64 శాతం శానిటరీ ప్యాడ్స్​ వాడుతున్నారు. 24 ఏండ్లు పైబడిన మహిళల సంఖ్యకు కూడా కలిపితే ఈ శాతం మరింత పెరుగుతుంది. ఈ ప్యాడ్స్​ వాడకం వల్ల థాలేట్స్ యోని ద్వారా శరీరంలోకి చేరతాయి. హార్మోన్ల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. 

అందువల్ల ఆడవాళ్లలో అండోత్పత్తి, సంతానోత్పత్తి పై ఎఫెక్ట్ పడుతుంది. యోనిలో వాపు, దురద వంటి రకరకాల సమస్యలు వస్తాయి. వీటి ప్రభావం గర్భాశయంపై పడుతుంది. దానివల్ల సంతానలేమికి కారణం కావచ్చు. ఇదేకాకుండా మెదడుపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. జననేంద్రియ వ్యాధులకు కూడా కారణం కావచ్చు. ఈ వ్యాధులు డయాబెటిస్, హైబీపీకి దారితీస్తాయి. గర్భస్రావం, ముందస్తు డెలివరీలు, మెనోపాజ్​ దశకు ముందుగానే చేరుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. 

ప్రత్యామ్నాయం ఉందా?

శానిటరీ ప్యాడ్స్​కు బదులు కాటన్ ప్యాడ్​లు, మెనుస్ట్రువల్ కప్స్​, టాంపూన్స్​ వాడొచ్చు. కానీ, వాటి తయారీలో ఎలాంటి రసాయనాలు వాడుతున్నారు? అవి ఎంత వరకు సేఫ్? అనే వివరాలు చూసుకోవాలి. మెనుస్ట్రువల్ హెల్త్ అలయన్స్ ఇండియా (ఎంహెచ్ఎ) అంచనా ప్రకారం, దాదాపు12 కోట్ల మంది మహిళలు శానిటరీ ప్యాడ్స్​ వాడుతున్నారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు పెద్ద సమస్యగా మిగిలాయి. 

దీనికోసం కొన్ని కంపెనీలు రీయూజబుల్​ ప్యాడ్స్​ తయారుచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి ప్యాడ్స్​ తయారుచేసే సంస్థలు 30 కంటే ఎక్కువ ఉన్నాయనేది అంచనా. అరటి నార, గుడ్డ, వెదురు వంటివాటితో తయారుచేస్తున్నారు. అయితే మన దేశంలో తయారయ్యే శానిటరీ ప్యాడ్స్​లో వాడే రసాయనాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని​ ప్రమాణాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది. 

రిప్రొడక్టివ్​ సిస్టమ్​లో ఇబ్బందులు

మగవాళ్ల రిప్రొడక్టివ్ సిస్టమ్​లో ఇబ్బందులు తలెత్తుతాయి. గర్భిణి​గా ఉన్న ఆడవాళ్లలో థాలేట్స్ ఎక్కువ స్థాయిలో ఉండి... వాళ్లు మగబిడ్డను కంటే కనుక వాళ్లలో స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఈ థాలేట్స్ స్పెర్మ్​లో డీఎన్​ఏని దెబ్బతీస్తాయి.

ఆడవాళ్లలో...

గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలోకి థాలేట్స్ వెళ్తే అవి నేరుగా రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. ఆ తర్వాత ప్లాసెంటాను దాటి పిండంపై ప్రభావం చూపిస్తాయని చెప్పారు రీసెర్చర్లు. ‘న్యూయార్క్ గ్రాస్​మన్ స్కూల్​ ఆఫ్ మెడిసిన్’ రీసెర్చర్లు చేసిన స్టడీ ప్రకారం ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే థాలేట్స్ ప్రతి పది ముందస్తు జననాల్లో ఒకదానికి కారణం అని తేలింది. నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితికి కారణం అవుతున్నాయి ఇవి. అలాగే అనారోగ్యాల రిస్క్​ను పెంచుతున్నాయని తేలింది ఆ రీసెర్చ్​లో. 

మరో స్టడీ..

ముందస్తు జననాలు, థాలేట్స్ మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు రీసెర్చర్లు ఈ మధ్య ఐదు వేల మంది గర్భిణులను పరిశోధించారు. అందులో భాగంగా గర్భధారణ సమయంలో తలెత్తే ఆరోగ్య సమస్యలు, అలాగే డెలివరీ డేట్​ను పరిగణనలోకి తీసుకున్నారు. యూరిన్ శాంపిల్స్​ను మూడు దశలుగా సేకరించారు. ఇరవై వేరువేరు మెటాబోలైట్​ లెవల్స్​ టెస్ట్​ చేశారు. అయితే థాలేట్స్ అనే కెమికల్​కి ఎఫెక్ట్ అయిన వాళ్లలో ముందస్తు జననాలు జరిగినట్టు గుర్తించారు. 

ముందస్తు జననాలకు, ప్లాస్టిక్​లో వాడిన థాలేట్, డై ఇథైల్ హెగ్జైల్​ థాలేట్ (డీఇహెచ్​పీ) అనే కెమికల్స్​కి  దగ్గరి సంబంధం ఉన్నట్టు రీసెర్చర్లు కనుగొన్నారు. డీఇహెచ్​పీ అతి తక్కువగా ఉన్న వాళ్లతో పోలిస్తే, యూరిన్​లో అధిక డీఇహెచ్​పీ లెవల్స్ కలిగిన గర్భిణులు 50 శాతం ఎక్కువగా ముందుగానే ప్రసవిస్తున్నారని ఆ రీసెర్చ్​లో తేలింది. ప్లాస్టిక్ వాడకం, అలాగే థాలేట్ కెమికల్స్​ను కంట్రోల్​ చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రపంచదేశాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు వాళ్లు. 

ప్యాక్ చేసిన కేక్​ మిక్స్​లు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాంబర్గర్ బన్స్, కూల్ డ్రింక్స్ వంటి అల్ట్రా – ప్రాసెస్డ్​ ఫుడ్స్ గర్భిణీల్లో థాలేట్ ఎక్స్​పోజర్​కు కారణం అవుతున్నాయి. అందుకని అలాంటి ఫుడ్స్​ జోలికి పోకుండా వాటికి బదులు తాజా పండ్లు, కూరగాయలు, తాజా మాంసం తినడం బెటర్ అని సూచించారు. నిజానికి థాలేట్స్ ప్లాస్టిక్ నుంచి శరీరంలోకి చేరేందుకు కాస్త టైం పడుతుంది. అలాగని ‘హెల్త్​ మీద ఎఫెక్ట్​ పడినప్పుడు  చూద్దాంలే’ అని లైట్ తీసుకోవడం మంచిది కాదు. సమస్యను రూట్​ లెవల్​లోనే తీసేస్తే ప్రమాదకరంగా మారకుండా ఉంటుంది. 

ఏటా లక్షమంది!

అమెరికాలో ఏటా లక్షమంది థాలేట్స్ వల్ల చనిపోతున్నారని ఒక స్టడీలో తేలింది. ఎక్కువగా ప్యాకేజ్​ ఫుడ్​ తినడం వల్ల థాలేట్స్ వాళ్ల శరీరంలోకి వెళ్లాయట. ఆ రీసెర్చ్​లో 55 నుంచి 64 మధ్య వయసున్న వాళ్లే ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లు తేలింది. మరణించిన వాళ్లలో 90 వేల నుంచి లక్ష మంది కార్డియో వాస్కులర్ డిసీజ్ ఉన్నవాళ్లే. 

మరికొన్ని ఉన్నాయి

నిత్యం మనం వాడే వస్తువుల్లో... ప్లాస్టిక్, థాలేట్స్ వంటి కెమికల్స్​తోపాటు మరికొన్ని హానికర రసాయనాలు ఉంటున్నాయి. అవి కూడా హెల్త్​ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.

ఆర్గానోఫాస్పేట్స్ : న్యూరో టాక్సిక్ కెమికల్స్​లో ఒక రకం. వీటిని1930ల కాలంలో యుద్ధాలప్పుడు కెమికల్ వెపన్స్​గా వాడారు. వాటిని ప్రస్తుతం అమెరికా పెస్టిసైడ్స్​గా​వాడుతోంది. అంటే పొలాల్లో కెమికల్స్ ఎక్స్​పోజర్ ఎక్కువ స్థాయిలో ఉన్నట్టే. ఇలాంటి పెస్టిసైడ్స్​కి పిల్లలు ఎక్కువగా ఎక్స్​పోజ్ అయితే వాళ్లలో అటెన్షన్ – డెఫిసిట్​ హైపర్ యాక్టివిటీ డిజార్డర్​ (ఎడిహెచ్​డి) వచ్చే ఛాన్స్​లు ఎక్కువ. మరి ఆ రసాయనాల బారిన పడకుండా ఉండాలంటే ఆ ఫుడ్ తినడం మానేయాల్సిందే. వాటికి బదులుగా సేంద్రియంగా పండించిన ఆహారాన్ని తినాలి. పెస్ట్ కంట్రోల్ కోసం వేరే పద్ధతులు వాడాలి. 

పాలీబ్రోమినేటెడ్ డైఫినైల్​ ఈథర్స్ : ఈ కెమికల్స్​ను నిప్పు పెట్టినా అంటుకోని బట్టలు లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. టీవీలు, కంప్యూటర్లు, ఇన్సులేటర్స్, ఫోమ్​ ప్రొడక్ట్స్, పిల్లల ఆటబొమ్మలు, బేబీ పిల్లోస్ వంటి వాటిలో వాడతారు. ఈ ఈథర్స్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే, ఎన్ని ప్రొడక్ట్స్​లో ఇవి ఉన్నాయనేందుకు క్లియర్​ రిపోర్ట్​ లేదు. మరి తెలుసుకోవడం ఎలా అంటే... ‘నిప్పు అంటినా కాలదు’ అనే లేబుల్​ ఉంటే ఆ ప్రొడక్ట్స్​కి దూరంగా ఉండడమే. ఈ కెమికల్స్ ఎక్కువగా పాత ఫర్నిచర్స్​లో ఉన్నట్టు కనిపెట్టారు. అందుకే సోఫాలు, దిండ్లను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. 

సీసం : సహజసిద్ధంగా పుట్టే లోహాల్లో సీసం (లెడ్) ఒకటి. దీన్ని1970ల కాలంలో గ్యాసోలిన్​లో వాడొద్దని బ్యాన్ చేశారు. నీళ్ల నుంచి సీసం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాత నీటి పైపుల్లో సీసం ఉంటుంది. కాబట్టి ట్యాప్ వాటర్​లో లెడ్​ ఉందేమో చెక్ చేసుకుంటుండాలి. ఇండస్ట్రియల్ పెయింట్స్, కారు బ్యాటరీల్లో వీటిని వాడతారు. పాత బిల్డింగ్​లో పెయింట్ రాలిపోతుంటే వెంటనే దాన్ని తీసేయాలి లేదా దాన్ని కప్పేయాలి. లేదంటే.. లెడ్​కి ఎక్స్​పోజ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతో  ఏడీహెచ్​డీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐక్యూ తక్కువ ఉండడం, ఎదుగుదల నెమ్మదించడం వంటివి ఉంటాయి. పసిపిల్లలు, పిల్లలు లెడ్​కి ఎక్స్​పోజ్​ అయ్యే రిస్క్​ ఎక్కువ. ఎందుకంటే వాళ్లు బొమ్మల్ని చేతులతో పట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి.

  పాదరసం : పాదరసం (మెర్క్యురీ) కూడా సహజంగా వచ్చే మూలకమే. బొగ్గు, నూనెలను మండించినప్పుడు పర్యావరణంలోకి విడుదలవుతుంది. మెర్క్యురీ అనేది థర్మామీటర్​, లైట్​ బల్బ్​లు, పాత డ్రయ్యర్స్, వాషింగ్​ మెషిన్స్​లో ఉంటుంది. పర్యావరణంలో ఉండే పాదరసం... చేపలు, షెల్ ఫిష్​ల్లోకి చేరొచ్చు. ఎన్విరాన్​మెంటల్ ప్రొటెక్షన్​ ఏజెన్సీ ప్రకారం.. మెర్క్యురీకి ఎక్స్​పోజ్ అవ్వడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, కాగ్నిటివ్ స్కిల్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకని ‘మెర్క్యురీ – ఫ్రీ’ వస్తువులు వాడాలి. 

పాలీ క్లోరినేటెడ్ బైఫినైల్స్ : కూలెంట్స్, లూబ్రికెంట్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్​మెంట్స్​లో ఇన్సులేటర్​గా పనిచేస్తాయి ఇవి. డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్​ చెప్పిన దాన్ని బట్టి... ఈ కెమికల్స్ క్యాన్సర్​కి కారణమవుతాయి. మోటార్ స్కిల్స్, పిల్లల్లో షార్ట్ టర్మ్ మెమరీ ప్రాబ్లమ్స్​ తలెత్తడం వంటివి కూడా వీటివల్లే. చేప, మాంసాల్లో ఇవి ఉంటాయి. తినే తిండి ద్వారానే ఇవి వంట్లోకి చేరుతున్నాయి.  అందుకే చేప లేదా మాంసం వండేముందు కెమికల్స్​తో నిండిన చర్మం, ఫ్యాట్, లోపలి అవయవాలు శుభ్రం చేయాలి. అలాగే వాటిని ఉడికించేటప్పుడు కొవ్వు అంతా కరిగేపోయే వరకు ఉడికించాలి.  1929 నుంచి1977 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ కెమికల్స్​ని కొన్ని వేల టన్నుల్లో వాడినట్లు రిపోర్ట్​లు చెప్తున్నాయి. 

గాలి కలుషితాలు : శిలాజ ఇంధనాలైన బొగ్గు, గ్యాస్​ తయారీ వల్ల గాలి కలుషితం అవుతోంది. వీటిలో నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్​ వంటివి ఉంటాయి. వాటివల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తాయి. కలుషిత గాలి పీల్చడం వల్ల పిల్లలు బరువు తక్కువగా పుడతారు. ప్రి–మెచ్యూర్డ్​ డెలివరీ, గుండె​ సంబంధిత సమస్యలు వస్తాయి. బెంజీన్​కి ఎక్కువగా ఎక్స్​పోజ్ అయితే ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్ (డబ్య్లూహెచ్​ఒ) చెప్తోంది. వీటిబారిన పడకుండా ఉండాలంటే ఈసారి ఫర్నిచర్ కొనేటప్పుడు ‘ఫార్మాల్డిహైడ్ – ఫ్రీ’ అని ఉన్నవే కొనాలి. పార్టికల్ బోర్డ్, ప్లైవుడ్ లేదా ప్రెస్డ్​ వుడ్​తో తయారైన ఫర్నిచర్​ని వాడొద్దు. ఎందుకంటే ఈ  ప్రొడక్ట్స్​లో ఫార్మాల్డిహైడ్ ఉన్న గ్లూ వాడతారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటాబయటా ప్రతీది రసాయనాలతో నిండినట్టే కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్​ చేసుకోవాలి. ఇకనుంచి ఏ ప్రొడక్ట్​ కొనాలన్నా బ్రాండ్​ పేరుతో పాటు ఏ రసాయనాలు వాడారనేది కూడా చూడాలి. అందుకు ప్యాకింగ్ వెనక ప్రొడక్ట్​ డిటెయిల్స్​ గమనించాలి. ప్రొడక్ట్​లో ఏ కెమికల్ ఉంటుందనేది తెలుసుకుంటేనే ఏం వాడారనేది ఈజీగా కనిపెట్టే వీలవుతుంది. ఇలా ఏ వస్తువు, ఫుడ్​ కొన్నా కెమికల్ – ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. టెన్షన్​ ఫ్రీ జీవితాన్ని గడపొచ్చు. 

గాలిలో కూడా..

ఇంట్లో చెత్త, గాలిలో కూడా థాలేట్స్ ఉంటాయి. అవి బిల్డింగ్ ప్రొడక్ట్స్ అయిన వినైల్ ఫ్లోరింగ్​, వినైల్ కార్పెట్ బ్యాకింగ్, లక్క వంటి వాటినుంచి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ గాఢత ఉండే కెమికల్స్​ని నేరుగా వాసన చూసినా లేదా పీల్చినా థాలేట్స్​ లోపలికి పోతాయి.  ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీ) అనే రసాయనాలు కళ్లు, ముక్కు, చర్మం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. చర్మంపై అలర్జీ, తలనొప్పి, గొంతు ఇన్ఫెక్షన్​ రావడానికి కారణమవుతాయి. లివర్, కిడ్నీలపై కూడా ఎఫెక్ట్ చూపించొచ్చు. వీఓసీలకు ఎక్కువ కాలం ఎక్స్​పోజ్ అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో క్యాన్సర్​ రిస్క్​తోపాటు సంతానలేమి సమస్యల వరకు థాలేట్​ ఎక్స్​పోజర్​ ఒక కారణం అని సైంటిస్ట్​లు చెప్తున్నారు.

ఇవన్నీ థాలేట్​లో రకాలే..

  •  టైల్స్, ఫోమ్, కార్పెట్ వంటి వాటిలో బ్యుటైల్ బెంజైల్ థాలేట్(బీబీపీ) ఉంటుంది. 
  •  నెయిల్ పాలిష్​లో డైబ్యుటైల్ థాలేట్(డీబీపీ) ఉంటుంది. 
  •  మెడికల్ ప్రొడక్ట్స్ అయిన డిస్పోజబుల్ గ్లవుస్​లు, క్యాథెటర్స్, ట్యూబ్స్, బ్లడ్ బ్యాగ్స్ వంటి వాటిలో 2–ఇథైల్ హెగ్జైల్​(డీఈహెచ్​పీ లేదా డై థాలేట్) ఉంటుంది. 
  •  డై – ఇథైల్ థాలేట్(డీఈపీ), పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్​లో ఎక్కువగా ఉంటుంది. 
  •  డై– ఐసోడెసైల్ థాలేట్ (డైడీపీ)ని, కన్​స్ట్రక్షన్ మెటీరియల్​, పెయింట్, ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ వంటి వాటిలో వాడతారు. 
  •  డై– ఐసోనోలీ థాలేట్(డైఎన్​పి), బొమ్మలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, బాత్ టాయ్స్, డ్రింకింగ్ స్ట్రాలు, రబ్బరు బాతుల్లో ఉంటాయి. 
  •  డై–ఎన్​–హెగ్జైల్ థాలేట్స్(బీఎన్​హెచ్​పీ), పీవీసీలో కలిపి ఫ్లోరింగ్, కాన్వాస్ టార్ప్స్, నోట్​బుక్ కవర్స్​ వంటి వాటిలో వాడతారు. 
  •  డై–ఎన్​–ఆక్టైల్ థాలేట్స్(డీఎన్​ఓపీ), బ్లడ్ బ్యాగ్స్, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యూబ్స్, వైర్, కేబుల్ వంటి వాటిల్లో ఉంటాయి.

ఎలా గుర్తించాలి?

  • ప్రొడక్ట్స్​లో థాలేట్స్ ఉన్నాయని చెప్పే లేబుల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి. అయినా కూడా వాటిని కనిపెట్టొచ్చు. ప్రొడక్ట్స్​లో ఎనిమిది థాలేట్స్ ఎక్కువగా వాడతారు.
  • సబ్బులు, షాంపూలు, మేకప్ ప్రొడక్ట్స్​ కొన్నింటి మీద థాలేట్స్ ఉన్నాయో లేదో చెప్పే లేబుల్స్ ఇవ్వరు. కానీ, ప్యాకేజింగ్​లో ఫ్రాగ్రెన్స్ లేదా పర్​ఫ్యూమ్​ వాడినట్లు ఇస్తారు. అవి ఉన్నాయంటే థాలేట్స్ ఉన్నట్టే!
  • రీసైక్లింగ్ గుర్తులో ‘మూడవ నెంబర్’, ‘వి లేదా పీవీసీ’ అనే పదాలు ఉన్నాయా చెక్​ చేయాలి. అవి ఉన్నాయంటే థాలేట్స్​ ఉన్నాయన్నట్టు.
  • మాయిశ్చరైజర్, నెయిల్ పాలిష్ వంటి వాటిల్లో థాలేట్ వార్నింగ్​ లేబుల్ ఉండదు. ఇంగ్రెడియెంట్స్​ ఉండవు. కాబట్టి కంపెనీ వెబ్​సైట్​లో ప్రొడక్ట్​ వివరాలు చూడాలి. లేదంటే కస్టమర్​ సర్వీస్​ సెంటర్​కి ఫోన్​ చేసి కనుక్కోవచ్చు. ఈ ప్రొడక్ట్స్​లో ‘నో థాలేట్’ లేదా ‘థాలేట్ ఫ్రీ’ ఉన్నవే తీసుకోవాలి. 

పరిష్కారాలు ఇవి

  • ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించాలి. 
  • ప్లాస్టిక్​ కంటెయినర్స్​లో ఫుడ్ పెట్టొద్దు. ఎక్కువసేపు వాటిలో ఫుడ్​ ఉండడం వల్ల థాలేట్స్​ లీక్ అయ్యి ఫుడ్​లో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సేఫ్​గా ఉండాలంటే ప్లాస్టిక్​ కంటెయినర్స్​ వాడకపోవడం బెటర్. వాటికి బదులు గ్లాస్​, స్టెయిన్​లెస్ స్టీల్​ కంటెయినర్స్ వాడాలి.
  • సువాసనలు వచ్చే పదార్థాలు, పర్​ఫ్యూమ్​లకు దూరంగా ఉండాలి. సువాసనలు వచ్చే ప్రొడక్ట్స్​లో థాలేట్స్ ఉంటాయి. 
  • చాలా కంపెనీలు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్​ని ‘థాలేట్ – ఫ్రీ’ అని మార్కెట్​ చేస్తున్నాయి. అలాంటి వాటిని కొనుక్కుంటే బెటర్.
  • ప్లాస్టిక్ బొమ్మలు బదులు చెక్క లేదా నాన్​ ప్లాస్టిక్ మెటీరియల్​తో తయారైన బొమ్మలు వాడాలి. 
  • లోషన్స్, లాండ్రీ డిటర్జెంట్స్ కూడా మంచి వాసన వస్తున్నాయని వాటిని వాడొద్దు. 
  • ​ ప్లాస్టిక్ కంటెయినర్​లో ఫుడ్ ప్రొడక్ట్ ఉంటే ఆ కంటెయినర్​ ఎన్నిసార్లు రీసైక్లింగ్​ అయిందో తెలుసుకునేందుకు ఉన్న కోడ్ చెక్ చేయాలి. ఇలా చేయడం వల్ల థాలేట్స్ బారిన పడడాన్ని తగ్గించుకోవచ్చు. 
  • గిన్నెలు, ఇల్లు శుభ్రం చేసేందుకు వాడే లిక్విడ్స్​ కూడా వాసన లేనివే వాడాలి. 
  • ఎయిర్​ ఫ్రెష్​నర్స్, 3, 6, 7 నెంబర్ల లేబుల్స్ ఉన్న ప్లాస్టిక్స్​ అస్సలు కొనొద్దు.

మనీష పరిమి