వనదేవత హిడింబి

వనదేవత హిడింబి

మహాభారతంలో హిడింబి రాక్షస వనిత. భీముడిని ఇష్టపడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఘటోత్కచుడి లాంటి వీరపుత్రుడిని కంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కగానొక్క కొడుకు చనిపోతే కన్నీరు మున్నీరవుతుంది. మానసిక ప్రశాంతతకోసం తపస్సు చేస్తూ, ప్రాణాలు వదిలేస్తుంది. కానీ, ఎప్పుడూ అధికారం కోసం ఆరాటపడదు. పట్టపు రాణి కావాలనుకోదు.  చివరి వరకు పచ్చని ప్రకృతి మధ్య, అడవితల్లి ఒడిలోనే బతికింది. అలాంటి  హిడింబికి హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని మనాలిలో గుడి ఉంది.

మనదేశంలో పార్వతి, లక్ష్మి, సరస్వతి… లాంటి ఎందరో స్త్రీ దేవతలకు గుళ్లున్నాయి. కానీ పురాణాల్లో రాక్షస పాత్రలుగా కనిపించే ఏ స్త్రీకి గుడి కనిపించదు. అలాంటిది హిడింబికి ఓ గుడి ఉంది. నిత్యం పూజలు చేస్తున్నారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తులు తమ కోర్కెలు తీర్చమని మొక్కుకుంటున్నారు. ఇంతకి.. హిడింబిలోని గొప్పతనం ఏమిటి? గుడి ఎక్కడ ఉంది?  ప్రత్యేకతేంటి?

గొప్ప ప్రేమికురాలు

పాండవులు లక్కఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత అడవిలోకి వెళ్తారు. మిగిలిన వాళ్లందరూ నిద్రపోతుంటే భీముడు కాపలా కాస్తూ ఉంటాడు. వాసనతో వాళ్లను గుర్తుపట్టిన హిడింబాసురుడు, చెల్లెలు హిడింబిని పంపించి వాళ్ల వివరాలు కనుక్కోమంటాడు. కానీ హిడింబి భీముడిని తొలి చూపులోనే ప్రేమిస్తుంది. భీముడు కాదన్నా, అతడిపై ఉన్న ప్రేమతో ‘మా అన్నవల్ల మీకు ముప్పు ఉంది, ఈ ప్రాంతాన్ని వదిలి పొమ్మ’ని సలహా ఇస్తుంది. భీముడు యుద్ధంలో హిడింబాసురుడిని చంపుతాడు. తర్వాత హిడింబి భీముడిని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. ‘కొంతకాలమే కలిసి ఉంటాను, తర్వాత మేం వెళ్లిపోతాం’ అని భీముడు పెట్టిన షరతులకు ఒప్పుకుని పెళ్లి చేసుకుంటుంది. భీముడితో ఉన్నన్ని రోజులు అతడికి తన ప్రేమను పంచుతుంది. ఘటోత్కచుడిని కంటుంది. అందుకే హిడింబి ప్రేమలో స్వార్థం లేదు. స్వచ్ఛమైంది. పాండవులతో పాటు వెళ్లదు. తన పుట్టిల్లైన అడవిలో కొడుకును పెంచుకుంటూ ఉండిపోతుంది.

ఆదర్శ మాత

హిడింబి కేవలం ప్రేమికురాలే కాదు. ఆదర్శమైన తల్లి కూడా. కొడుకు పుట్టిన తర్వాత భీముడు, మిగిలిన పాండవులు, కుంతి.. ఆమెను అడవిలోనే వదిలేసి తమపాటికి తాము వెళ్లిపోతారు. అయినా ఆమె  అధైర్యపడదు. భర్త దగ్గర లేకపోయినా కొడుకును ఆదర్శవంతంగా పెంచుతుంది.  తండ్రిలేని లోటు రానివ్వదు. మాయలు, మంత్రాలు, యుద్ధ విద్యల్లో ఘటోత్కచుడిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతుంది. తండ్రి భీముడు, మిగిలిన పాండవులపై అభిమానం కలిగేలా చేస్తుంది. అవసరమైనప్పుడు వాళ్లకు సాయం చేయమంటుంది. యుద్ధంలో పాండవులను కాపాడడానికి ఘటోత్కచుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చనిపోతాడు.

అడవిబిడ్డ

హిడింబికి నగర జీవితం కంటే అడవిలో ప్రకృతి మధ్య బతకడం అంటేనే ఎక్కువ ఇష్టం. కొండలు, గుట్టలు, చెట్లు, సెలయేళ్లు, పువ్వులు… ప్రకృతిలోని ప్రతి అందాన్ని అనుభూతి చెందుతూ బతుకుతుంది. భీముడిని పెళ్లి చేసుకున్నాక అతడికి ఆ అడవిలోని అందమైన ప్రదేశాలన్ని చూపిస్తుంది. పాండవులు యుద్ధంలో విజయం సాధించి, రాజ్యాధికారం చేపట్టాక కూడా తను నగరానికి వెళ్లదు. తన చివరి జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం అడవినే ఎంచుకుంటుంది. పర్వతాలు, జలపాతాలు., అందమైన చెట్ల మధ్య  కూర్చొని తపస్సు చేస్తుంది. హిడింబి కష్టాలు వచ్చినా, సంతోషం వేసినా ఎప్పుడూ అడవిని వదిలి వెళ్లదు. అడవిలోనే జీవితాంతం ఉండిపోయింది. ప్రకృతితోనే కలిసి బతికింది. అందుకే హిడింబి అడవిబిడ్డ.

కనువిందు చేసే అందాలు

హిమాలయ దిగువ ప్రాంతం. ఎటుచూసినా మంచు. ఏపుగా మబ్బుల్ని తాకేలా పెరిగిన చెట్లు. పర్యాటకులను ఆకట్టుకునే అందమైన ప్రాంతం. హిమాచల్‌‌ప్రదేశ్‌‌లోని మనాలి. అలాంటి సుందర ప్రదేశంలో హిడింబిదేవి గుడి ఉంది. చూడ్డానికి ఇది చాలా పురాతన కట్టడంలా  కనిపిస్తుంది. మనదేశంలో హిడింబిమాతకు ఉన్న ఒకే ఒక్క గుడి ఇది. మనాలి వెళ్లిన పర్యాటకులు తప్పకుండా హిడింబి ఆలయానికి వెళ్లి, ఆ దేవిని దర్శించుకుని, ప్రకృతి ఒడిలో సేదతీరి వస్తారు. ఈ ఆలయం పక్కన ప్రవహించే నీళ్లలో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా పోతాయని భక్తులు నమ్ముతారు. పర్యాటకులు ఈ నీళ్లలో స్నానం చేసిన తర్వాతే హిడింబి దర్శనం చేసుకుంటారు. చల్లటి వాతావరణంలో ఆ నీళ్లలో స్నానం చేయడం వింత అనుభూతి.

పురాతన ఆలయం

రాజా బహుదూర్‌‌సింగ్‌‌ ఈ దేవాలయాన్ని క్రీ. శ. 1553లో నిర్మించాడు. ఈ గుడి 24 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
మనాలికి 2.5. కి. మీ. దూరంలో ఉంది. ధూన్‌‌గిరి వనవిహార్‌‌ అనే అటవీప్రాంతంలో ఉండటం వల్ల ‘దుంగ్రీ మందిర్‌‌’ అని కూడా పిలుస్తారు. అలాగే హిడింబిదేవిని హిర్మాదేవి అని కూడా అంటారు. ఈ ఆలయం చెక్కతో నాలుగు అంతస్తుల్లో పగోడా ఆకారంలో కనిపిస్తుంది. ఈ గుడి దగ్గరకు వెళ్లాలంటే కొంతదూరం మెట్ల మీద ప్రయాణం చేయాలి. వాటికి ఇరువైపులా క్యాప్‌‌లు, చెక్కబొమ్మలు, డ్రై ప్రూట్స్‌‌ అమ్మే షాపులు ఉంటాయి. గుడి, పరిసరప్రాంతాలు మంచుతో కప్పబడి కనిపిస్తుంటాయి. గుడిలోకి వెళ్లాలంటే దారి చాలా సన్నగా ఉండటం వల్ల భక్తులు వంగి వెళ్లాలి. గుహ లోపల హిడింబి దేవి విగ్రహం చాలా చిన్నది. ఆమె పాదముద్రలు కూడా ఉన్నాయి. రోజూ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటుంది. ఈ గుహలోనే హిడింబి తపస్సు చేసిందని స్థానికులు చెప్తారు.

ఉత్సవాలు.. పూజలు


హిడింబిదేవిని ఇక్కడి ప్రజలు నవరాత్రుల సమయంలో పూజిస్తారు. ఉత్సవాల్లో బాగంగా డూన్గరి మేళాను వైభవంగా చేస్తారు. ఈ మేళాలో ఆడపిల్లలు సంప్రదాయ దుస్తులు అలంకరించుకుని నృత్యం చేస్తారు. అలా చేయడం వల్ల హిడింబిదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. వసంతరుతువులో జరిగే ఈ ఉత్సవం చూడ్డానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వేల సంఖ్యలో వస్తారు. హిడింబిదేవికి మొక్కుకుంటే ఘటోత్కచుడి లాంటి బలవంతులైన పిల్లలు పుడతారని నమ్ముతారు.  యుద్ధంలో కొడుకు చనిపోయిన తర్వాత ఆ బాధతో హిడింబి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడే తపస్సు చేస్తూ ప్రాణాలు విడవడం వల్ల ఆమె శక్తి ఈ  ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తుందని అక్కడివాళ్లు చెప్తారు. తల్లి కాబోయే వాళ్లు ఇక్కడకు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ గుడికి 70 మీటర్ల దూరంలోనే ఘటోత్కచుని ఆలయం కూడా ఉంది.