ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ డిసెంబర్ 5 కు వాయిదా 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ డిసెంబర్ 5 కు వాయిదా 
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయొద్దని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేషనల్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బీఎల్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌కు సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఆయనను అరెస్టు చేయొద్దని సిట్ ను ఆదేశించింది. ఈ కేసులో ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలని బీఎల్‌‌‌‌‌‌‌‌ సంతోష్‌‌‌‌‌‌‌‌కు సిట్‌‌‌‌‌‌‌‌ 41ఏ సీఆర్పీసీ నోటీసులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ అత్యవసరంగా విచారణ జరపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ కింద రిట్ పిటిషన్ ను బీఎల్ సంతోష్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ సురేందర్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం విచారణ జరిపారు. 

ఈ సందర్భంగా బీఎల్ సంతోష్ తరఫున సీనియర్ లాయర్ డి.ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘బీజేపీ అగ్రనేత అయిన సంతోష్‌‌‌‌ ముందుగా నిర్ణయించుకున్న మేరకు వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. విచారణకు హాజరు కాలేనని సిట్‌‌‌‌కు కూడా తెలియజేశారు. కానీ, కావాలనే పిటిషనర్‌‌‌‌ పై సిట్‌‌‌‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం కూడా పనిగట్టుకొని లేనిపోని దుష్ర్పచారం చేస్తోంది.

ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో సంతోష్‌‌‌‌ పేరే లేదు. అయినా పోలీసులు కావాలని తప్పుడు ప్రచారం చేయడాన్ని చూస్తుంటే అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. నిబద్ధత గల నేతపై ఈ తరహాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. ఈ కేసులో సంతోష్‌‌‌‌ కు ఎలాంటి సంబంధం లేదు. 41ఏ సీఆర్‌‌‌‌పీసీ నోటీసులను రద్దు చేయాలి” అని కోరారు. అయితే సంతోష్‌‌‌‌ వద్ద కీలక సమాచారం ఉందని, ఈ కేసులో ఆయన పాత్రను తేల్చాల్సి ఉందని సిట్‌‌‌‌ తరఫున ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్, అదనపు ఏజీ రామచందర్‌‌‌‌రావు వాదించారు. స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు. వాదనలు విన్న కోర్టు.. సిట్‌‌‌‌ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది. 

తీర్పును స్వాగతిస్తున్నాం: ప్రేమేందర్ రెడ్డి

బీఎల్ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో, బీజేపీపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే నోటీసులు ఇచ్చిందని హైకోర్టు తీర్పుతో స్పష్టమవుతోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

నోటీసులపై సిట్ దగ్గర జవాబు లేదు: రచనా రెడ్డి

 

బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే, స్టే వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘‘బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన అనుమానితుడా? సాక్షినా? అనేది అందులో పేర్కొనలేదు. అనుమానితుల నుంచి ఎలాంటి ఆధారాలు లభించాయనే దానిపై కోర్టుకు సిట్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సంతోష్ కు నోటీసులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని హైకోర్టు పోలీసులను ప్రశ్నించగా, వాళ్లు సరైన సమాధానం చెప్పలేకపోయారు” అని చెప్పారు. దీంతో నోటీసుల అమలుపై కోర్టు స్టే విధించిందన్నారు.