
- అప్పీలును కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: గ్రూపు–1 ప్రిలిమ్స్ పరీక్షలను ఈ దశలో వాయిదా వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 9న ఆదివారం జరగబోయే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని గుర్తు చేసింది. జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని శుక్రవారం దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మినారాయణతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 4.30 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారని, అదే ఇంటిలిజెన్స్ బ్యూరో పోస్టులకు హాజరయ్యే వారి సంఖ్య పరిమితంగా ఉంటుందన్నారు. పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం అప్పీలును కొట్టివేసింది.