
హైదరాబాద్, వెలుగు: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జన్మించి 8 ఏళ్లపాటు పెరిగిన భవనాన్ని చారిత్రక నిర్మాణంగా ప్రకటించాలన్న వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక నిర్మాణాన్ని చారిత్రకమైనదిగా ప్రకటించాలా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దీనికి చట్టంలో ఎలాంటి విధానం లేదన్నారు.
హైదరాబాద్ బేగంబజార్‌లో మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ పుట్టి, 8 ఏళ్లపాటు నివసించిన భవనాన్ని చారిత్రక భవనంగా కేంద్రం గుర్తించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఘన శ్యాం భాటి అనే వ్యక్తి 2014లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ భవనంలో పిటిషనర్ గత 30 ఏళ్లుగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారన్నారు.
ఈ భవనాన్ని కూల్చివేయడానికి పలువురు ప్రయత్నిస్తున్నారన్నారు. మాజీ రాష్ట్రపతి నివసించిన ఆ భవనాన్ని చారిత్రక నిర్మాణంగా ప్రకటించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆ భవనంలో అద్దెకు ఉంటున్న వ్యక్తికి పిటిషన్ వేసే అర్హత లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. అద్దెకు ఉంటున్న పిటిషనర్‌కు పిటిషన్ వేసే అర్హత లేదంటూ దానిని కొట్టివేశారు.