కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు
  • అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై విచారణ

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌ తరఫున స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్​లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ బి.విజయ్​సేన్ రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ప్రతివాదులైన చీఫ్‌ సెక్రటరీ, లా అండ్‌ అసెంబ్లీ సెక్రటరీ, ఎలక్షన్‌ కమిషన్​కు కూడా నోటీసులిచ్చారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం, వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ హైకోర్టును ఆశ్రయించారు.

 అసెంబ్లీ ఆఫీస్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే లోపలికి కూడా అనుమతించలేదని, అందుకే హైకోర్టుకు రావాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. కాంగ్రెస్‌లో చేరడం పార్టీ ఫిరాయింపుల చట్ట నిబంధనలకు వ్యతిరేకమన్నారు. దీనిపై హైకోర్టు గత విచారణ సమయంలో అనర్హత పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్‌ ఆఫీస్​కు అందజేయాలని ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో అడ్వొకెట్ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి కల్పించుకుని.. పిటిషన్ల ప్రతులు స్పీకర్‌ ఆఫీస్​కు అందాయన్నారు. ఈ మేరకు పిటిషనర్‌కు నిర్ధారణ కూడా చేశామన్నారు. ఇదే తరహా కేసులో గతంలో దానం నాగేందర్‌కు నోటీసులు జారీ అయ్యాయి.