ప్రత్యేక నీటి కుంటల్లోనే గణేశ్ ​నిమజ్జనం చేయాలి : హైకోర్టు

ప్రత్యేక నీటి కుంటల్లోనే గణేశ్ ​నిమజ్జనం చేయాలి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ ట్యాంక్‌ బండ్ సహా చెరువుల్లో నీరు కలుషితం కావొద్దంటే ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనుల్లోనే గణేశ్ విగ్రహాల​ నిమజ్జనం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఉత్తర్వులకు అనుగుణంగానే ఈసారీ నిమజ్జనం చేయాలంది.

పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం ఎత్తేయాలని.. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ) నిబంధనలను కొట్టి వేయాలని పేర్కొంటూ గణేష్‌ మూర్తి కళాకారుల సంక్షేమ సంఘం, మరో ఎనిమిది మంది దాఖలు చేసిన వ్యాజ్యాలపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌తో కూడిన బెంచ్​ సోమవారం విచారణ చేపట్టింది. 

పిటిషననర్ల తరఫు న్యాయవాది.. ధూల్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ వాసులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపకుండా ప్రస్తుత ఉపాధిని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. మరో న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. గత సంవత్సరం హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ లో నిమజ్జనం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది హరీందర్‌‌‌‌‌‌‌‌ పరిషద్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. పీవోపీ, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌లతో చేసిన వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనుల్లోనే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.

హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌లో వాటిని నిమజ్జనం చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వం 2020లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు నిమజ్జనం జరగాలని, ఆ నిబంధనలను సర్కారు అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది.

తామిచ్చిన ఉత్తర్వుల ప్రతిని అధికారులకు వెంటనే అందజేయాలని, ఉత్తర్వులను విధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, అమలు చేసిన చర్యల నివేదికను విచారణ నాటికి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.