అవిశ్వాసాలపై సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పు కరెక్టే: హైకోర్టు

అవిశ్వాసాలపై సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పు కరెక్టే: హైకోర్టు
  •     ఎంపీపీలు, వైస్ ఎంపీపీల అప్పీల్​ను కొట్టేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: ఎంపీపీలు, వైస్ ఎంపీపీల అవిశ్వాసాలపై సమావేశాలు నిర్వహించవచ్చని ఆర్డీవోలకు  సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. మార్చి 12 నాటి తీర్పును సవాల్‌‌‌‌ చేస్తూ దాఖలైన అప్పీల్‌‌‌‌ను శనివారం కొట్టివేసింది. తమపై అవిశ్వాసాలు నిర్వహించేలా ఆర్డీవోలు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ పలువురు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆర్డీవోల నుంచి ఫామ్‌‌‌‌–5 నోటీసులు పిటిషనర్లకు అందాయని.. తెలంగాణ పంచాయతీ రాజ్‌‌‌‌ చట్టం 2018లోని సెక్షన్ 263 ప్రకారం ఆ నోటీసులు ఇచ్చే అధికారం ఆర్డీవోలకు లేదని పేర్కొన్నారు. ఆర్డీవో జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌‌‌‌పై విచారణ చేపట్టిన సింగిల్‌‌‌‌ జడ్జి.. కొత్త చట్టంలో నిబంధనలు లేనప్పుడు పాత చట్టమే వర్తిస్తుందని చెప్పింది. 

ఏప్రిల్‌‌‌‌ 2లోగా అవిశ్వాసాల సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. సింగిల్‌‌‌‌ జడ్జి మార్చి 12న ఇచ్చిన ఆదేశాలను సవాల్‌‌‌‌ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీపీ అధ్యక్షుడు రవీందర్‌‌‌‌ గౌడ్‌‌‌‌ హైకోర్టులో అప్పీల్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్​జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ బెంచ్ విచారణ చేపట్టింది. ఆర్డీవో జారీ చేసిన నోటీసులు చెల్లవని పిటిషన్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కలెక్టర్‌‌‌‌ తర్వాత ఆర్డీవో, సబ్‌‌‌‌ కలెక్టర్, అసిస్టెంట్‌‌‌‌ కలెక్టర్లు ఒకే కేటగిరీ కిందకు వస్తారని చెప్పారు. వీరిలో ఎవరికైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విషయంలో అవిశ్వాసాలపై నోటీసులు జారీ చేసే అధికారం ఉంటుందన్నారు. వాదనలు విన్న బెంచ్.. సింగిల్‌‌‌‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ, అప్పీల్‌‌‌‌ను కొట్టివేసింది.