రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు విచారణ

రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చిన్నారుల అదృశ్యం తీవ్రమైన, సున్నితమైన అంశమంటూ హైకోర్టు స్పందించడంతో 30 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చిన్నారుల అదృశ్యంపై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని, న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని  హైకోర్టు ఆదేశించింది. అలాగే రాష్ట్రంలో మొత్తం ఎంత మంది చిన్నారులు అదృశ్యమయ్యారు? ఆచూకీ తెలుసుకునేందుకు ఏఏ చర్యలు తీసుకున్నారో స్పష్టమైన నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అలాగే ఎంత మందిని కుటుంబాలకు చేర్చారు? వారు సమాజంతో కలిపేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని హైకోర్టు సూచించింది. బాలల అక్రమ రవాణా ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. వీటన్నింటిపై వచ్చే జూన్ 17లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయ సేవాధికార సంస్థ, జువైనల్ జస్టిస్ బోర్డులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను ప్రతివాదులుగా చేర్చింది హైకోర్టు.