భూ యాజమాన్య హక్కులను కోర్టు నిర్ధారించదు: హైకోర్టు

భూ యాజమాన్య హక్కులను కోర్టు నిర్ధారించదు: హైకోర్టు
  • భూయాజమాన్య హక్కులను కోర్టు నిర్ధారించదు
  • ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: విద్యుత్​​ కనెక్షన్​ కోరుతూ దాఖలైన రిట్​ పిటిషన్​లో భూ యాజమాన్య హక్కులను కోర్టు నిర్ధారించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందని గుర్తు చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌లోని వట్టినాగులపల్లి శంకర్‌‌హిల్స్‌‌ లేఅవుట్‌‌లోని తన ప్లాట్‌‌కు విద్యుత్‌‌ కనెక్షన్‌‌ కోసం గత సెప్టెంబర్‌‌లో దరఖాస్తు చేసుకున్నా భూ యాజమాన్య సంబంధ వివాదం ఉందంటూ టీఎస్పీడీసీఎల్‌‌ అధికారులు నిరాకరిస్తున్నారని సికింద్రాబాద్‌‌ సీతాఫల్‌‌మండీకి చెందిన గోపు నాగమణి హైకోర్టును ఆశ్రయించారు. 

కాగా, పిటిషనర్‌‌ ప్లాట్‌‌కు విద్యుత్‌‌ కనెక్షన్‌‌ మంజూరు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదే లేఔట్‌‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన జైహింద్‌‌ గ్రీన్‌‌ఫీల్డ్స్‌‌, ఎల్‌‌ఎల్‌‌పీ అభ్యర్థనను తిరస్కరించారు. వారికి హక్కులు లేవన్నారు. ఈ తీర్పును సవాల్‌‌ చేస్తూ  జైహింద్‌‌ గ్రీన్‌‌ఫీల్డ్స్‌‌ అప్పీల్‌‌ దాఖలు చేసింది.  దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విద్యుత్‌‌ కనెక్షన్‌‌ వివాదంపై దాఖలైన పిటిషన్‌‌లో నిబంధనలను సింగిల్‌‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడింది. రిట్‌‌ పిటిషన్లలో భూ హక్కులను నిర్ధారించే పరిధి కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. సింగిల్‌‌ జడ్జి ఆదేశాలను కొట్టివేసింది. నిబంధనల మేరకు జైహింద్‌‌ గ్రీన్‌‌ఫీల్డ్స్‌‌, ఎల్‌‌ఎల్‌‌పీకి విద్యుత్‌‌ కనెక్షన్‌‌ మంజూరు చేయాలని టీఎస్పీడీసీఎల్‌‌ను ఆదేశించింది.