భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నిర్మించిన నల్గొండలోని బీఆర్ఎస్ బిల్డింగ్‌ను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రెండేండ్ల కిందట పర్మిషన్స్ లేకుండా నిర్మించిన జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్‌ను కూడా ఆఫీసర్లు కూల్చివేస్తారా.. కొనసాగిస్తారా అనే చర్చ నడుస్తోంది. జిల్లా బీఆర్ఎస్ నేతల్లోనూ ఇదే టెన్షన్ నెలకొంది. గతంలో కొత్తగూడెం పట్టణంలో పర్మిషన్స్ లేకుండా బిల్డింగ్లు కడుతున్నారంటూ పలువురికి మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు.
పట్టణంలోని మేదరబస్తీ, బూడిదగడ్డ, సూర్యోదయ స్కూల్ నుంచి పాత కొత్తగూడెం వెళ్లే దారితో పాటు పలు బస్తీల్లో అక్రమ నిర్మాణాలంటూ పలు కట్టడాలను కూల్చివేశారు. అప్పు చేసి కట్టుకున్న ఇంటిని కూల్చవద్దని మేదరబస్తీలో ఓ ఇంటి యజమానికి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఆ సమయంలో బీఆర్ఎస్ బిల్డింగ్‌ను పర్మిషన్స్ లేకుండా కడుతున్న విషయాన్ని పలువురు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్నామని ఎవరు చెప్పినా వినకుండా బిల్డింగ్‌ను నిర్మించారు. అయితే ప్రస్తుతం నల్గొండలో పర్మిషన్స్ లేకుండా కట్టిన బీఆర్ఎస్ బిల్డింగ్ కూల్చివేతతో ఇక్కడి బిల్డింగ్‌ను కూడా కూల్చివేస్తారా అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.