స్కూళ్లు, కాలేజీల్లో సౌలతులు పెంచండి

స్కూళ్లు, కాలేజీల్లో  సౌలతులు పెంచండి
  • 4 వారాల్లో నివేదిక ఇవ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్‌డీఎంఏ పేర్కొన్న పాఠశాల భద్రతా విధానం-2016 నిబంధనల మేరకు సౌలతులు కల్పించి 4 వారాల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల ప్రధాన కార్యదర్శులు, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌, ఇంటర్‌ బోర్డుతోపాటు కేంద్ర మహిళా వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

విద్యాలయాల్లో సౌలతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీ గురు తేజ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో రక్షణ చర్యలతో పాటు ఫైర్ సేఫ్టీ, శానిటేషన్‌, తాగునీరు వంటి సౌలతులు పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదిస్తూ..మెడిసిన్స్

ప్రథమ చికిత్స కిట్లు, తాగు నీటి ట్యాంక్‌లు అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీచర్లు, విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై శిక్షణ అందించాలన్నారు.  మూడు నెలలకోసారి అధికారులు విద్యాలయాల్లో తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వసతుల ఏర్పాటుపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.