
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం అమలుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, న్యాయ శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో 1973 నాటి భూ సంస్కరణల (వ్యవసాయ భూముల సీలింగ్) చట్టం అమలు చేయకపోవడంపై మెదక్ జిల్లాకు చెందిన సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షుడు కంచరి బ్రహ్మం.. హైకోర్టుకు లేఖ రాశారు. చట్టంలోని మినహాయింపులను ఆసరాగా తీసుకుని కంపెనీల పేరుతో భూములను కొనుగోలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఆర్థికంగా సంపన్నులైన కొంత మంది కంపెనీల పేరుతో భూములను తమ ఆధీనంలో ఉంచుకోవడం వల్ల భూముల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. దీనివల్ల సాగు కోసం రైతులు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదన్నారు. సాగుకు భూమి లేక రైతులు కూలీలుగా మారుతున్నారని, భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీలింగ్ చట్టాన్ని అమలు చేయని అధికారులపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.