లీగ్‌ మ్యాచ్‌ సెలక్షన్‌ కమిటీని కొనసాగించండి..హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం

లీగ్‌ మ్యాచ్‌ సెలక్షన్‌ కమిటీని కొనసాగించండి..హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: లీగ్‌ మ్యాచ్‌ సెలక్షన్‌ కమిటీని, సూపర్‌వైజరీ కమిటీలను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. హెచ్‌సీఏ జనరల్‌బాడీ మీటింగ్‌ (ఏజీఎం)లో  నిర్ణయాలు తీసుకునే వరకు ఆ కమిటీలను కొనసాగించాలంటూ అంబర్‌పేట్‌కు చెందిన జై హనుమాన్‌ క్లబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ కె.శరత్‌ విచారించారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ..2025–26 కాలంలో నిర్వహించబోయే లీగ్‌ మ్యాచ్‌లను హెచ్‌సీఏ నిబంధనలు, సూపర్‌వైజరీ కమిటీ నివేదిక మేరకు వ్యవహరించేలా హెచ్‌సీఏను ఆదేశించాలన్నారు. సెలక్షన్‌ కమిటీలను, సూపర్‌వైజరీ కమిటీలను తొలగిస్తే హెచ్‌సీఏ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోడానికి వీలుంటుందన్నారు. ఏజీఎంలో నిర్ణయాలు తీసుకునే వరకు ఆ కమిటీలను కొనసాగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. .

వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. కౌంటర్‌ దాఖలు చేయాలని హెచ్‌సీఏను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ కమిటీలను కొనసాగించాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.