
- కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించలేం: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవుల అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓయూ స్టూడెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున మరో కేసు అవసరం లేదని తేల్చి చెప్పింది.
అన్నింట్లోనూ సీఎంపై ఫిర్యాదు చేసుకుంటూ పోతే ఎలాగని ప్రశ్నించింది. పిటిషనర్లు వేరే ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాలు చూసుకోవాలని హితవు పలికింది. పోలీసుల దర్యాప్తు పూర్తయ్యాక నకిలీ సర్క్యులరా లేదా ఒరిజినల్ సర్క్యులరా అన్నది తేలుతుందని హైకోర్టు పేర్కొంది. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి.. నకిలీ సర్క్యులర్‌ను జతచేస్తూ చేసిన ట్వీట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మే 1, 4వ తేదీన ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఓయూ విద్యార్థి సీహెచ్ దశరథ్, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.