
- మేజిస్ట్రేట్ కోర్టు వైఖరిపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సీఎం రేవంత్ అనుచిత విమర్శలు చేశారని, ఆయనపై ఫిర్యాదు చేస్తే కింది మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేయకుండా వాయిదా వేయడం ఏంటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంప్లైంట్ చేసిన అంశాల జోలికి వెళ్లకుండానే.. ఎంక్వైరీని రెండు నెలలకు వాయిదా వేయడం సరికాదని మండిపడింది. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది’’అంటూ నిరాధార ఆరోపణలు చేశారని మేజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఎంక్వైరీ చేయకుండానే కోర్టు విచారణను వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ కోర్టు వైఖరిని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించారు.
‘‘మే 4న జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై నిరాధార ఆరోపణలు చేశారు. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని తప్పుడు ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశారు. రేవంత్‌పై మే 14న ఫిర్యాదు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండానే కేసును మేజిస్ట్రేట్ కోర్టు జులై 6కు వాయిదా వేసింది’’అని పిటిషనర్ తరఫులాయర్ కోర్టుకు తెలిపారు.
దీంతో ఆధారాలు ఉంటే విచారించి నోటీసులివ్వాలని, లేదంటే దర్యాప్తునకు పోలీసులను పంపాలని, ఇవేమీ చేయకుండా వాయిదా వేయడం సరికాదంటూ హైకోర్టు విచారణను క్లోజ్ చేసింది.