అరెస్ట్ వద్దని చెప్పలేం: సీఎంకు హైకోర్టు షాక్

అరెస్ట్ వద్దని చెప్పలేం: సీఎంకు హైకోర్టు షాక్

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు హైకోర్టు షాకిచ్చింది. ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ అరెస్ట్ వద్దని ఎలా చెపుతాం అని హైకోర్టు ప్రశ్నించింది. గురువారం (మార్చి 21) కేజ్రీవాల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను  ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను గురువారం విచారించిన ఢిల్లీ హైకోర్టు..కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే ఈ మధ్యంతర పిటిషన్ పై ఈడీ స్పందనను కోరింది ఢిల్లీ హైకోర్టు. 

కేజ్రీవాల్ గురువారం (మార్చి 21) నాడు తమ ముందు హాజరు కావాలని కోరుతూ తొమ్మిదో సారి ఈడీ నోటీసులు జారీ చేసింది. సమన్లు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు పదే పదే నిరాకరించారు. ఈడీ ముందు ఎందుకు హాజరు కావడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.ఈ విషయంలో తన క్లయింట్ ఈడీ ముందు హాజరవుతారు.. కానీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందుకే ఈడీ చర్యలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని  కేజ్రీవాల్ పిటిషనర్ తరపు న్యాయవాది  అభిషేక్ సింఘ్వి హైకోర్టును కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 22 కు వాయిదా వేసింది. 

మరోవైపు ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.