- బెంగాల్‌లో ఫస్ట్ ఫేజ్, తమిళనాడులో ఒకే విడత
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
- 152 స్థానాల్లో ఓటు వేయనున్న 3.60 కోట్ల జనం
- 8 వేల సమస్యాత్మక కేంద్రాలు గుర్తింపు
- మొత్తం 2,450 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
- ఎన్నికల తనిఖీలతో బెంగాల్‌లో
- 472 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్
- తమిళనాడులో 599 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం
కోల్‌కతా, చెన్నై: పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడులో ఈ రోజు (గురువారం) పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా.. బెంగాల్‌లోని 294 సీట్లకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. బీజేపీకి కంచుకోటగా భావించే ఉత్తర బెంగాల్‌లోని 54 స్థానాలతోపాటు ముర్షిదాబాద్, నదియా, మాల్దా వంటి సరిహద్దు జిల్లాల్లో పోలింగ్ సాగనుంది. కోటి 75 లక్షల మంది మహిళలతో సహా మొత్తం 3.60 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల సంఘం 8,000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఆయా చోట్ల రికార్డు స్థాయిలో 2,450 (2 లక్షల నుంచి 2.45 లక్షల మందికి పైగా జవాన్లు) కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. దీన్నిబట్టి ఇక్కడ పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.2021 ఎన్నికల్లో ఈ 152 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 93 సీట్లు గెలవగా, బీజేపీ 59 స్థానాలకే పరిమితమైంది. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ ప్రాంతం బీజేపీకి భారీ ఆధిక్యాన్ని అందించింది. ఇప్పుడు దక్షిణ బెంగాల్‌లో టీఎంసీని ఢీకొట్టాలంటే.. బీజేపీ ఉత్తర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గూర్ఖా సమస్యకు ఆరు నెలల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇక్కడి ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, టీఎంసీ కూడా ఉత్తర ప్రాంతంలో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి టీ తోటల కార్మికులు, రాజ్‌బన్షీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరిస్తామని హామీలిచ్చింది.
ఓటర్ల జాబితా సవరణ వివాదం
ఈ ఎన్నికల్లో అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాల కంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), పౌరసత్వం అనే అంశాలు ప్రధాన అజెండాగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 91 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. మాల్దా, ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో లక్షలాది పేర్లు మాయమవ్వడం కలకలం రేపుతోంది.
రూ. 1,000 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్
బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ. 1,000 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఫిబ్రవరి 26న ‘ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 22 నాటికి మొత్తం రూ.1,072.13 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. తమిళనాడులో రూ.599.24 కోట్ల విలువైన వస్తువులు, బెంగాల్‌లో రూ. 472.89 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 127.67 కోట్ల నగదుతో పాటు రూ. 106.3 కోట్ల విలువ చేసే 40 లక్షల లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.184.83 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 215.19 కోట్ల విలువైన బంగారం, వెండి వంటి లోహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

