హయత్ నగర్ కృష్ణవేణి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్

హయత్ నగర్ కృష్ణవేణి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత.. పలువురి అరెస్ట్

హయత్ నగర్లోని కృష్ణవేణి హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి యాజమాన్యం దాదాపు 18 కాలనీలకు వెళ్లే రోడ్డు కబ్జా చేసిందని స్థానికులు ఆందోళనకు దిగారు. అక్రమంగా గోడ నిర్మించారంటూ దాన్ని జేసీబీతో కూల్చివేశారు. కాలనీవాసుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. స్థానికుల ఆందోళన, గోడ కూల్చివేయడంతో హాస్పిటల్ మేనేజ్మెంట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కాలనీవాసులతో పాటు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో వెంకన్న అనే వ్యక్తి చేయి విరగడంతో ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు కాలనీవాసులు, బీజేపీ లీడర్లు నాలుగు గంటలకుపైగా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. హాస్పిటల్ జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మాణం చేపట్టిందని పోలీసులు చెబుతున్నారు. గోడ కూల్చివేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేయనున్నట్లు హయత్ నగర్ ఇన్స్పెక్టర్ చెప్పారు.