హుజురాబాద్‌‌లో హై టెన్షన్.. బీజేపీ మహిళా నేతల అరెస్టు

హుజురాబాద్‌‌లో హై టెన్షన్.. బీజేపీ మహిళా నేతల అరెస్టు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌‌లో హైటెన్షన్ నెలకొంది. TRS, BJP నేతల బహిరంగ చర్చ, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుజురాబాద్ అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలంటూ BJP MLA ఈటల రాజేందర్ కు MLC  పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 4 రోజుల క్రితం ఈటల చర్చకు రావాలని హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతి లేకపోయినా గులాబీ శ్రేణులు స్టేజి ఏర్పాటు చేసి మైకులు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. స్టేజీపై రెండు కుర్చీలు వేశారు.

శుక్రవారం భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ప్రొటక్షన్ ఇచ్చి వేదిక వద్దకు తీసుకరావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే.. సభా వేదిక వద్దకు వచ్చిన బీజేపీ మహిళ నాయకురాలు పంజల లక్ష్మి, లతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని, తామే చర్చిస్తామని వస్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. మరోవైపు..చర్చకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎందుకని తామే వస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో ముందస్తుగా పోలీసులు అరెస్టుల పర్వానికి తెరలేపారు. ఎక్కడికక్కడనే నేతలను నిర్భందం చేశారు. వారు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల వ్యవహరాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. 

దీనిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. హుజురాబాద్‌‌లో కొట్లాడుదామా ? గజ్వేల్ లో కొట్లాడుదామా అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉందన్నారు. నీచపు కుట్రలను, కేసీఆర్ ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. ప్రశాంతంగా ఉంటున్న హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు సవాల్ విసిరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రశ్నించారు. అనుమతి లేకుండా టీఆర్ఎస్ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి, జెండాలు కట్టుకోవడానికి పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేవలం బీజేపీ వాళ్లను మాత్రమే అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ పాదయాత్ర నేపథ్యంలో అటెన్షన్ డైవర్ట్ చేసి హుజురాబాద్ లో అశాంతిని రాజేసేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని వెల్లడించారు.