హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లేఅవుట్లో, మేడ్చల్ జిల్లా మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్న భూములను HMDA వేలం వేసింది. ఈ వేలంలో ప్లాట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం విశేషం. కోకాపేటలో ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17, 18లకు ఈరోజు అధికారులు ఈ వేలం నిర్వహించారు. ప్లాట్ నెంబర్17 లో 4.59 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలకడం గమనార్హం. ఈరోజు వేలంలో 9.90 ఎకరాలకు 1,355.33 కోట్లను HMDA పొందడం విశేషం.
కోకాపేట నియోపోలీస్లో ఒక్కో ఎకరానికి 99 కోట్ల ప్రారంభ ధరను హెచ్ఎండీఏ నిర్ణయించింది. అయితే.. అంతకు మించే ఎకరం ధర పలికింది. నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లకు HMDA ఈ వేలం నిర్వహించనుంది. కోకాపేట్ నియోపోలీస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు 75 కోట్ల చొప్పున ప్రారంభ ధరను HMDA నిర్ణయించింది.
కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసే వారికి ఆకాశమే హద్దుగా ఎన్ని ఫ్లోర్లయినా నిర్మించుకునేందుకు అనుమతులు ఇస్తారు. ఈ లేఅవుట్లో అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. దాదాపు 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.40 ఎకరాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో సైక్లింగ్ట్రాక్స్, 45 మీ. వెడల్పైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలను కల్పించారు. అలాగే కమర్షియల్, రెసిడెన్సీ, ఎంటర్టైన్మెంట్ల అవసరాలకు భవనాలు నిర్మించుకునేందుకు అనుమతించనున్నారు.
Also read:- సనత్ నగర్ ESI హాస్పిటల్లో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని HMDA ఈ వేలం నిర్వహించింది. ఒక్కో ప్లాట్ 1.98 ఎకరాల నుంచి 5.31 ఎకరాల వరకు ఉంది. 2023లో కోకాపేటలో భూములను వేలం వేయగా ఎకరానికి 100.75 కోట్లు పలికింది. ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. తాజా వేలానికి బిడ్డింగ్లోనే సర్కారు వారి పాటను కోకాపేటలో ఎకరానికి రూ.99 కోట్లు, గోల్డెన్మైల్ లేఅవుట్లో రూ.70 కోట్లు, మూసాపేటలో రూ.75 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల వేలం ద్వారా దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా.
అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియోపోలిస్ లేఅవుట్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎయిర్పోర్ట్కూడా 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండడంతో దేశ విదేశీ బడా కంపెనీలు ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
