
గంటన్నరలో ఎంత దూరం ప్రయాణిస్తారు? బస్సులో అయితే ఓ 60 కిలోమీటర్లు. రైల్లో అయినా దాదాపు అంతే. విమానమైతే ఓ 600 కిలోమీటర్లు వేసుకోండి. అదే గంటన్నరలో 5600 కిలోమీటర్ల దూరం వెళ్లిపోతే..! సాధ్యమేనా అంటారు కదా. దాన్ని సాధ్యం చేయడానికే అమెరికాకు చెందిన హెర్మియస్ అనే కంపెనీ ఓ విమానాన్ని తయారు చేస్తోంది. గంటకు 5310 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానానికి రూపునిస్తోంది. ఒక్కసారి ఇంధనం నింపితే 7400 కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణిస్తుందట. ఈ విమానం తయారీ కోసం కంపెనీకి ఇప్పటికే సీడ్ ఫండింగ్ కూడా మొదలైందట. దీన్ని ఆర్స్ టెక్నికా అని పిలుస్తున్నారు. టైటానియంతో దీని బాడీని తయారుచేస్తారట. వచ్చే ఐదేళ్లలో పనిచేసే ఓ ప్రొటో టైప్ మోడల్‌ను తయారు చేసి డెమో చూపిస్తారట. ఇంతకీ ఈ కంపెనీ ఎట్లా తయారైందో తెలుసా? జెఫ్ బెజోస్ కంపెనీ అయిన బ్లూ ఆరిజిన్, ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఇద్దరు మాజీ ఉన్నతాధికారులు కలిసి హెర్మియస్ను పెట్టారు