
- మిలిటెంట్లు తప్పించుకోకుండా ఇజ్రాయెల్ సైన్యం జాగ్రత్తలు
- హమాస్‌ను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా స్థావరాలపై దాడులు
- హాస్పిటల్స్ దగ్గర్లోనే ఎయిర్ స్ట్రైక్స్
గాజా: హమాస్ టెర్రరిస్టుల స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్‌తో గాజాలోకి దూసుకెళ్తున్నది. హమాస్ టెర్రరిస్ట్‌లు దాక్కున్న టన్నెళ్లు, క్యాంపులపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నది. నార్త్, సెంట్రల్ గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించింది. వేలాది మంది తలదాచుకుంటున్న హాస్పిటల్స్ కు దగ్గర్లోనే వైమానిక దాడులు జరుగుతున్నాయని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ ట్యాంకులు, బుల్డోజర్లను ఇజ్రాయెల్ దళాలు గాజా నార్త్, సౌత్ హైవేపై అడ్డంగా పెట్టాయి.
గాజా నార్త్ లో లక్షలాది మంది పాలస్తీనియన్లు తలదాచుకున్నారు. నార్త్ – సౌత్ హైవేను బ్లాక్ చేయడంతో హమాస్‌లు ఎటూ తప్పించుకోలేరని ఇజ్రాయెల్ ఆర్మీ భావిస్తున్నది. నార్త్ గాజాలోని హాస్పిటల్స్‌లో సుమారు 1.17 లక్షల మంది ఉన్నారు. వీరిలో వేలాది మంది పేషెంట్లు, మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు. అయితే, ఇప్పటికే చాలా మంది గాజా సౌత్ సైడ్ వెళ్లిపోయారు. ఇప్పటిదాకా 8వేల మంది పాలస్తీనీయన్లు చనిపోయారు. 14 లక్షల మంది గాజా వదిలి వెళ్లిపోయారు. 1,400 మంది ఇజ్రాయెలీలు చనిపోగా.. వారిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలే ఉన్నారు.
33 ట్రక్కుల్లో నీళ్లు, ఆహారం, మెడిసిన్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యావసర సరుకులతో నిండిన సుమారు 40 వరకు ట్రక్కులు గాజాలోకి వెళ్లాయి. అయితే, తమకు ఎలాంటి సాయం అందలేదని గాజా వాసులు అంటున్నారు. గోదాముల్లో పిండి, గోధుమలు లేవని, ఆకలితో అలమటిస్తున్నామని చెబుతున్నారు. అయితే, ఆదివారం వాటర్, ఫుడ్, మెడిసిన్స్ ఉన్న 33 ట్రక్కులు ఈజిప్ట్ వద్ద ఉన్న రాఫా క్రాసింగ్ నుంచి గాజాలోకి ఎంటరైనట్లు అధికారులు తెలిపారు.
సౌత్ సైడ్ సరిపడా ఆహారం, నీళ్లు, మెడిసిన్స్ ఉన్నాయని, వెంటనే నార్త్ సైడ్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిస్తున్నాయి. ఒక వేర్ హౌస్‌లో 80 టన్నుల ఫుడ్ ఉందని, పెరుగుతున్న ఆహార అవసరాలు తీర్చడానికి ప్రతి రోజూ కనీసం 40 ట్రక్కులు గాజాలోకి ఎంటర్ కావాల్సి ఉంటుందని యూఎన్ ప్రతినిధులు తెలిపారు.
నగ్నంగా ఊరేగించిన మహిళ మృతి
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మహిళా పోలీసును చంపి, డెడ్ బాడీని ఊరేగించారంటూ గతంలో ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఉన్నది జర్మనీ యువతి షనీ లౌక్ అని, ఆమె చనిపోలేదని అధికారులు తర్వాత ప్రకటించారు.
మిలిటెంట్ల దాడిలో గాయపడిన షనీ లౌక్‌ను ఆసుపత్రిలో చేర్పించారని చెప్పారు. అయితే, గాజాలోకి ఎంటరైన బలగాలు అక్కడి ఇండ్లల్లో జరిపిన సోదాల్లో షనీ లౌక్ డెడ్ బాడీ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలను షనీ కుటుంబ సభ్యులకు పంపించగా.. అది షనీ లౌక్దేనని వారు గుర్తించారు.
ఓటింగ్‌కు దూరంగా ఉండటాన్ని ఖండిస్తున్నాం: కాంగ్రెస్
గాజాకు సాయంపై యునైటెడ్ నేషన్స్ లో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు ఇండియా దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కేంద్ర వైఖరిని ఖండిస్తూ సోనియా గాంధీ ఓ ఎడిటోరియల్ రాశారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలోని అమాయక ప్రజలు చనిపోతున్నారన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య చర్చలు జరగాలని, దీనికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఇద్దరి మధ్య న్యాయం జరగకుండా శాంతి నెలకొనే అవకాశం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా హింసకు తావు లేదని తెలిపారు. పాలస్తీనీయులను ఇజ్రాయెల్ బలవంతంగా తమ ఇండ్లను ఖాళీ చేయిస్తున్నదని మండిపడ్డారు. గాజాకు సంఘీభావంగా యూఎన్ తీర్మానంపై ఓటింగ్‌కు ఇండియా దూరంగా ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.