హిమాలయాల కరుగుడు రెండింతలైంది

హిమాలయాల కరుగుడు రెండింతలైంది
  • 21వ శతాబ్దం మొదటి నుంచి ఇదే పరిస్థితి

ఒకప్పుడు భూమికి ‘థర్డ్​ పోల్​ (మూడో ధ్రువం)’గా నిలిచిన హిమాలయాలు ఇప్పుడు క్రమంగా కరుగుతున్నాయి. 21వ శతాబ్దం మొదలు ఇప్పటిదాకా ఆ పర్వతం రెండింతల మంచును కోల్పోయింది.  ఏటా కనీసం ఒకటిన్నర అడుగులు కరుగుతూ వస్తోందని  అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దీని వల్ల హిమాలయ సరిహద్దుల్లోని దేశాల్లో మంచి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  40 ఏళ్లుగా ఇండియా, చైనా, నేపాల్, భూటాన్ దేశాల్లో హిమాలయాలపై పరిస్థితులను సైంటిస్టులు శాటిలైట్లతో అంచనా వేశారు.  వాతావరణ మార్పు హిమాలయాలను క్రమంగా తినేస్తోందని పేర్కొన్నారు. 1975 నుంచి 2000 మధ్య ఓ మోస్తరుగా ఉన్న హిమాలయాల కరుగుదల, 2000 తర్వాత రెట్టింపు అయినట్టు సైంటిస్టులు వెల్లడించారు. అయితే 40 ఏళ్లలో ఎంత మేరకు హిమాలయాలు కరిగాయనే విషయంపై అధ్యయనం చేయలేదని చెప్పారు. 1975–2000తో పోలిస్తే 2000–2016 మధ్య ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగిందని హెచ్చరిస్తున్నారు.  ప్రస్తుతం 6 వేల కోట్ల టన్నుల మంచు హిమాలయాలపై ఉన్నట్టు  అంచనా వేశారు.

650 ఫొటోలు తీసిన స్పై శాటిలైట్లు
హిమాలయ పర్వాలు దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి. అలాంటి పర్వతాలను అమెరికాకు చెందిన స్పై శాటిలైట్లు 650 ఫొటోలు తీశాయి. ఈ మధ్యే వాటిని విడుదల చేశారు. ఆ ఫొటోలనే కొలంబియా యూనివర్సిటీ సైంటిస్టులు పరిశీలించారు. 3డీ నమూనాలను తయారు చేసి అధ్యయనం చేశారు. ఆ తర్వాత సొంత శాటిలైట్ ద్వారా సేకరించిన డేటాను స్పై శాటిలైట్ల డేటాతో పోల్చారు.  వాటి విస్తీర్ణం, సైజు ఏటేటా తగ్గుతున్నట్టు తేల్చారు.  2000 సంవత్సరం తర్వాత హిమాలయ పర్వతాల కరుగుదల రెండింతలైందని నిర్ధారించారు. అదే 1975 నుంచి 2000 సంవత్సరాల మధ్య ఏటా 0.25 మీటర్ల మందమైన మంచు మాత్రమే కరిగినట్టు వివరించారు. 1990ల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం వల్ల ఆ తర్వాతి పదేళ్లలో మంచు కరుగుదల ఏడాదికి 0.50 మీటర్ల మందానికి చేరిందని సైంటిస్టులు వెల్లడించారు. ఇటీవల హిమాలయాల్లో కరిగిన మంచు వల్ల 800 కోట్ల టన్నుల నీళ్లు వృథాగా పోయాయని చెప్పారు. దీంతో రాబోయే రోజుల్లో దానికి ఆనుకుని ఉన్న దేశాల్లో తాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిమాలయాలు దాదాపు 80 కోట్ల మంది సేద్యం, కరెంట్​ తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి.

అంతా శిలాజ ఇంధనాల వల్లే
ఆసియా దేశాల్లో నానాటికీ శిలాజ ఇంధనాల వాడకం పెరుగుతోందని, వాటిని మండించడం వల్ల గాల్లో చేరిన కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలు సూర్యుడి నుంచి వచ్చిన వేడిని వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని, దీంతో భూమి వేడెక్కి మంచు కొండలు కరుగుతున్నాయని సైంటిస్టులు వివరించారు. అయితే,  యూరప్​లోని ఆల్ప్స్​ పర్వతాలతో పోలిస్తే హిమాలయాల్లో కరుగుతున్న మంచు తక్కువేనని చెబుతున్నారు. మున్ముందు ఆల్ప్స్​ లాగానే హిమాలయాలూ వేగంగా కరుగుతాయని హెచ్చరిస్తున్నారు.