అనారోగ్యంతో సీఐ మృతి.. పాడె మోసిన ఎంపీ

అనారోగ్యంతో సీఐ మృతి.. పాడె మోసిన ఎంపీ

అనంతపురం: ఒకనాటి సహచర మిత్రుడు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ మాధవ్ స్పందించారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతేకాదు.. అంత్యక్రియలు ముగిసే వరకు  గ్రామంలోనే ఉండి.. తన చిరకాల మిత్రుడి పాడె మోసి కడసారి అంతిమ వీడ్కోలు పలికారు. హోదా పెరిగాక పాత సహచరులను మర్చిపోయే నేటి రోజుల్లో హిందూపురం ఎంపీ స్పందించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు టు టౌన్ సీఐ గా పనిచేస్తున్న కురుబ ములకన్న(51) అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం విధులకు సెలవు పెట్టి గత ఆరు నెలలుగా తన స్వగ్రామమైన అనంతపురం జిల్లా  కల్యాణదుర్గం మండలం మంగళ కుంట గ్రామంలోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. 
ఒకనాటి తన సహచర మిత్రుడు కర్నూలు టు టౌన్ సీఐ గా విధులు నిర్వహిస్తున్న ములకన్న ఆదివారం సాయంత్రం స్వగ్రామంలో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే స్పందించి మిత్రుడి కడసారి చూపు కోసం స్వగ్రామానికి వెళ్లారు. సోమవారం అంత్యక్రియల సందర్బంగా పాడె మోసి మిత్రుడికి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందించడం తన ధర్మం అని.. తనకు ఎప్పుడైనా ఫోన్ చేసి సంప్రదించవచ్చని కుటుంబ సభ్యులను ఓదార్చారు.