ఈ సారి అతని వ్యూహాలు పని చేయవు.. రోహిత్ చెలరేగడం ఖాయం: గంగూలీ

ఈ సారి అతని వ్యూహాలు పని చేయవు.. రోహిత్ చెలరేగడం ఖాయం: గంగూలీ

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షాహీన్ ఆఫ్రిది, నజీమ్ షా, హారిస్ రౌఫ్ లతో కూడిన బౌలింగ్  లైనప్ ఎంతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా పాక్ విజయాలు సాధించడంలో ఈ త్రయం కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అందరూ పాకిస్థాన్ సంచలనం, యార్కర్ల వీరుడు షాహీన్ ఆఫ్రిది ఈ సారి కూడా భారత్ ని చిత్తు చేస్తాడని పాక్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా భారత మాజీ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ భారత్ బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేసాడు.

అఫ్రిదికి అంత సీన్ లేదు:

2021 టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో షాహీన్ తన తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ ని కూడా పెవిలియన్ కి చేర్చాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ పాక్ పేసర్ ముందు నిలవలేడనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఆఫ్రిది గురించి అంత భయపడాల్సిన అవసరం లేదని గంగూలీ చెప్పాడు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి బౌలర్లు ఉండటం సహజమని, షాహీన్‌ అఫ్రిదీ గొప్ప బౌలరే అయినప్పటికీ..అతని గురించి మరి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలియజేశాడు. ఈ సారి రోహిత్ శర్మ ముందు అతని బౌలింగ్ వ్యూహాలు పని చేయవని.. అఫ్రిదీని ఎదుర్కోవడానికి రోహిత్ సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి వీరిద్దరిలో ఎవరు ఆధిపత్యం చూపిస్తారో చూడాలి.

రేపే మ్యాచ్:

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రేపు (సెప్టెంబర్ 2) జరగనుంది. శ్రీలంకలోని పల్లకెల స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ఇరు జట్లు రేపు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సారి దాయాదుల మధ్య పోరు హోరాహోరీగా ఉండడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొబైల్ ద్వారా హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ ని ఫ్రీగా చూడవచ్చు. మరి అనుభవంతో కూడిన టీమిండియా మరోసారి చిరకాల ప్రత్యర్థిపై పై చేయి సాధిస్తుందో లేకపోతే ఫామ్ లో ఉన్న పాక్.. భారత్ కి షాక్ ఇస్తుందో రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.